కలం, కరీంనగర్ : గుజరాత్ రాష్ట్రంలో జరిగిన ఆల్ ఇండియా ఎన్జీఓ టేబుల్ టెన్నిస్ టీమ్ మీట్ జాతీయ స్థాయి పోటీల్లో తెలంగాణ పోలీస్ శాఖ తరఫున హుజూరాబాద్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వి. మాధవి, సీఐడీ విభాగం మహిళా అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ కె. పద్మ విశేష ప్రతిభ (Telangana Police Officers) కనబరిచారు. మహిళల డబుల్స్ (50+ విభాగం)లో వీరిద్దరూ రజత పతకాన్ని (సిల్వర్ మెడల్) సాధించి రాష్ట్రానికి, పోలీస్ శాఖకు గర్వకారణంగా నిలిచారు.
గుజరాత్‌లో జరిగిన జాతీయ పోటీల్లో పతకాలు సాధించిన వీరిని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం తన కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా వారి మెడలో పతకాలు వేసి సత్కరించిన సీపీ గౌస్ ఆలం మాట్లాడుతూ.. ఒకవైపు కఠినమైన పోలీస్ విధులు నిర్వర్తిస్తూనే, మరోవైపు జాతీయ స్థాయి క్రీడల్లో రాణించడం తోటి సిబ్బందికి ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. తమ క్రీడా ప్రతిభను గుర్తించి నిరంతరం ప్రోత్సహిస్తున్న కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంకి, ఉన్నతాధికారులకు ఏసీపీ వి. మాధవి, డబ్ల్యూఏఎస్ఐ కె. పద్మలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

