కలం, ఖమ్మం బ్యూరో: విద్యతోనే పేదరిక నిర్మూలన సాధ్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) స్పష్టం చేశారు. శుక్రవారం ఖమ్మంలోని జహీర్పురాలో రూ. 3 కోట్ల అంచనా వ్యయంతో ఆధునిక వసతులతో నిర్మించనున్న బీసీ బాలికల హాస్టల్ భవన నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భావితరాల పిల్లలకు సకల విద్యా సౌకర్యాలు అందిస్తే వారు సాధించలేనిది ఏదీ ఉండదనే సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.
ఖమ్మం నగరంతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విద్యా సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. సీఎం సహకారంతో ఖమ్మం జిల్లాకు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, మెడికల్ కాలేజీతో పాటు స్వామినారాయణ వంటి ప్రైవేట్ విద్యాసంస్థలను తీసుకువచ్చామని పేర్కొన్నారు. కొత్తగూడెంలో మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకోవడం ఉమ్మడి ఖమ్మం జిల్లాకు దక్కిన గొప్ప అవకాశమని చెప్పారు.
ఉమ్మడి జిల్లాలోని గిరిజన, దళిత, బీసీ సహా అన్ని బలహీన వర్గాల పిల్లల విద్యకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తుమ్మల వివరించారు. ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం రూ. 1 లక్ష నుండి రూ. 1.25 లక్షల వరకు ఖర్చు చేస్తూ నాణ్యమైన విద్యను అందిస్తోందన్నారు. ఈ అవకాశాన్ని బలహీన వర్గాల ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని, తల్లిదండ్రులు తమ పిల్లలను కష్టపడి చదివిస్తే ఆ కుటుంబాలు శాశ్వతంగా ఆర్థిక భారం, పేదరికం నుండి బయటపడతాయని అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందాలని ముఖ్యమంత్రి ఆశిస్తున్నారని తెలిపారు. హాస్టల్ భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి, త్వరలోనే విద్యార్థుల ఉపయోగంలోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంతరావు, జిల్లా బీసీ సంక్షేమ అధికారిణి జి. జ్యోతి, ఖమ్మం ఆర్డీవో ఎన్. శ్రీనివాస్, విద్యా శాఖ ఈఈ బుగ్గయ్య, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

