కలం, వెబ్ డెస్క్: దేశంలోనే ప్రముఖ క్రీడా రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ 11వ తేదీ నుంచి గ్రామాల్లో ‘ఖేలో ఇండియా’ క్రీడా ఉత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న క్రీడాకారులకు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వబోతోందని చెప్పారు. ఈ మేరకు హైదరాబాద్ లోని తుర్కపల్లి బీసీ సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల & జూనియర్ కళాశాల ప్రాంగణంలో రాష్ట్రస్థాయి క్రీడా పోటీలను శుక్రవారం ఒలింపిక్ జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. అనంతరం వాలీబాల్ పోటీలను ప్రారంభించి ఎమ్మెల్యే మల్లారెడ్డి, విద్యార్థులతో కలిసి వాలీబాల్ ఆడారు.
గురుకుల విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి.. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ప్రజా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని మంత్రి తెలిపారు. చదువుతో పాటు క్రీడలు కూడా విద్యార్థి జీవితంలో అంతర్భాగమని పేర్కొన్నారు. సీఎం శ్రీ రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దక్షిణ కొరియా వంటి చిన్న దేశాలు వందల సంఖ్యలో బంగారు పతకాలు సాధిస్తున్నాయని.. మన దేశ క్రీడాకారులు కూడా ఒలింపిక్స్, ఆసియా క్రీడల్లో బంగారు పతకాలు సాధించే స్థాయికి ఎదగాలని కోరారు. గురుకుల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం డైట్ ఛార్జీలను 40 శాతం పెంచిందని కొనియాడారు.

