కలం, వెబ్ డెస్క్: హరిహర క్షేత్రంగా విరాజిల్లుతున్న తిరుమల (Tirumala) శ్రీవారి కొండపై ఉన్న కపిలతీర్థంలో శుక్రవారం శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో (Sri Kapileswara Swamy) రుద్రయాగం వైభవంగా ప్రారంభమైంది. వేదమంత్రోచ్చారణల నడుమ వైదిక శాస్త్రానుసారం వేద పండితులు యాగం నిర్వహించారు. యాగ క్రతువును వీక్షించేందుకు వచ్చిన భక్తులతో వేదమంత్రాల ఘోష, రుద్రజప ధ్వనులతో ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. స్వామివారికి నెల రోజుల పాటు జరుగుతున్న హోమ మహోత్సవాల్లో భాగంగా నవంబరు 27 నుంచి డిసెంబరు 6వ తేదీ వరకు 11 రోజుల పాటు రుద్రయాగం చేయనున్నారు.
తొలిరోజు ఉదయం యాగశాలలో పూజ, రుద్రజపం, హోమం, లఘు పూర్ణాహుతి, నివేదన, హారతి కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం శ్రీ కపిలేశ్వరస్వామివారి శాస్త్రోక్తంగా లక్ష బిల్వార్చన పూజ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. ఈ యాగంలో పాల్గొనాలనుకునే గృహస్తులు రూ.500 రుసుము చెల్లించి టికెట్ కొనుగోలు చేసి హోమంలో పాల్గొనవచ్చని టీటీడీ అధికారులు తెలిపారు. వీరికి ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం అందజేయనున్నారు.

