కలం, వెబ్‌డెస్క్: ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. కేబినెట్‌లో విశాఖలోని రుషికొండ భవనాల (Rushikonda Palace)పై చర్చలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగు నెలల పాటు రుషికొండ భవనాలను ప్రజల సందర్శనలకు అనుమతించాలని నిర్ణయించారు. దీన్ని పీపీపీ పద్ధతిలో ఆతిథ్య ప్రాజెక్టుగా అభివృద్ధి చేయనున్నారు. దీనికి టికెట్ కూడా వసూలు చేయనున్నారు. త్వరలో టికెట్ ధరలు నిర్ణయించి అధికారిక ప్రకటన విడుదల చేస్తారు.
ఈ ప్రాజెక్టు చేపట్టేందుకు పెద్దపెద్ద సంస్థలు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో టాటా, లీలా ప్యాలెస్, అట్మాస్ఫియర్ కోర్ వంటి తొమ్మిది సంస్థలు ఉన్నట్లు సమాచారం. సీఆర్‌జడ్ నిబంధనల సడలింపుతో మరో నాలుగు ఎకరాల్లో రుషికొండపై కొత్త నిర్మాణాలకు కూడా అవకాశం ఉన్నట్లు కేబినెట్‌లో చర్చ జరిగింది. ఇందులో భాగంగా సుమారు 150 గదుల వరకు నిర్మించుకునే ఛాన్స్ ఉందని అధికారులు వెల్లడించారు.
గత వైసీపీ హయాంలో నిర్మించిన ఈ విలాసవంతమైన భవనాలపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. వైఎస్ జగన్ పెద్ద మొత్తంలో ప్రజా ధనం దుర్వినియోగం చేసి ఈ భవనాలు కట్టారని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. జగన్ చేసిన వృథా ఖర్చు ప్రజలకు తెలియాలనే వీటిని ప్రజల సందర్శనకు అనుమతించాలని నిర్ణయించారు. మొత్తానికి సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అయిన రుషికొండ భవనాలను కొద్ది రోజుల్లో ప్రజలందరూ చూసే అవకాశం కలుగనుంది.

