కలం, కరీంనగర్ : ముంబై వేదికగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘3వ వరల్డ్ మేయర్స్ ఫోరం’ (3rd World Mayors Forum) అంతర్జాతీయ సదస్సులో కరీంనగర్ నగర మేయర్ కోలగాని శ్రీనివాస్ (Mayor Kolagani Srinivas) పాల్గొని, వివిధ దేశాల మేయర్లతో, పట్టణాభివృద్ధి శాఖ మంత్రులతో భేటీ అయ్యారు. ముంబైలోని ఫెయిర్మాంట్ హోటల్ వేదికగా గత రెండు రోజులుగా ఈ సదస్సు కొనసాగింది.
ఈ అంతర్జాతీయ సదస్సుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్య అతిథిగా హాజరుకాగా, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 దేశాలకు చెందిన నగరాల మేయర్లు, వివిధ రాష్ట్రాల పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు, స్థానిక ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొన్నారు. భవిష్యత్ నగరాల అభివృద్ధిపై రెండు రోజుల పాటు విస్తృతంగా చర్చలు జరిగాయి. సదస్సులో మొదటి రోజు ‘భారతదేశం 2047 కోసం ప్రణాళిక – 2047 నాటికి నగరాలను పునర్నిర్మించడం’, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత భవిష్యత్ నగరాల నిర్వహణ, పట్టణ వ్యర్థాల సమస్య పరిష్కారం, సర్క్యులర్ సిటీస్, ప్రపంచ పెట్టుబడుల ద్వారా స్థానిక అభివృద్ధి వంటి అంశాలపై సాంకేతిక సమావేశాలు జరిగాయి.
రెండవ రోజు నగరాలను మరింత సురక్షితంగా మార్చడం, నదీ నగరాల అభివృద్ధి, ప్రజల ప్రయాణానికి ప్రాధాన్యతనిచ్చే పట్టణ రవాణా వ్యవస్థ, నెట్-జీరో మౌలిక సదుపాయాలు, వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కోవడం, మెట్రోపాలిటన్ పాలన బలోపేతం, క్రీడా దౌత్యం ద్వారా ఆరోగ్యకరమైన నగరాల నిర్మాణం వంటి అంశాలపై చర్చించి ముగింపు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ కోలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ అంతర్జాతీయ వేదికపై కరీంనగర్ నగర అభివృద్ధి నమూనపై తమ పాలకవర్గానికి నగరపాలక సంస్థకు ఉన్న సంకల్పాన్ని వివరించామని తెలిపారు. అలాగే, ప్రపంచ స్థాయి నగరాల్లో అమలవుతున్న అత్యుత్తమ విధానాలను అధ్యయనం చేసేందుకు ఈ సదస్సు ఎంతో దోహదపడిందని ఆయన తెలిపారు.

