కలం, వెబ్ డెస్క్ : భారత్ సమ్మిట్ 2026 (Bharat Summit 2026) వేదికపై విదేశీ ప్రతినిధుల బహిరంగ ప్రసంగాలను నియంత్రించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. హైదరాబాద్‌లో నవంబర్ 13, 14 తేదీల్లో జరిగిన ఈ సదస్సులో ఇటలీ రాజకీయ నాయకుడు జియాకోమో ఫిలిబెక్ (Giacomo Filibeck) ‘ఓట్ చోర్, గద్దీ ఛోడ్’ అని నినాదాలు చేయడంతో పాటు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి మద్దతుగా మాట్లాడిన వీడియోలను సోషల్ మీడియా నుంచి తొలగించాలని పిటిషనర్ కోరారు.
విదేశీ ప్రతినిధుల హాజరు, వారికి మంజూరు చేసిన అనుమతులపై స్వతంత్ర సిట్ (SIT) దర్యాప్తు జరిపించాలని కూడా ఆ పిటిషన్‌లో అభ్యర్థించారు. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరిపి తిరస్కరించింది. ఈ అంశాన్ని వినతిపత్రంగా పరిగణించేలా అధికారులను ఆదేశించాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోరగా, సంబంధిత అధికారులకు నేరుగా వినతిపత్రం ఇచ్చుకోవడానికి ఎవరూ అడ్డుచెప్పడం లేదని ధర్మాసనం పేర్కొంది.

