కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. కూకట్పల్లి ట్రక్ పార్క్ భూములు (Kukatpally Truck Park Land) వేలం వేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, సామాజిక కార్యకర్త కాంతారావు వేసిన పిటిషన్లను కొట్టేసింది. హై కోర్టు తీర్పు నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నమే వేలం ప్రక్రియ మొదలు కాబోతుంది.
కూకట్‌పల్లిలోని మూసాపేట ప్రాంతంలో 33 ఎకరాల భూమిని HMDA వేలం వేసేందుకు ప్రయత్నిస్తోంది. ట్రక్కుల పార్కింగ్ కోసం ప్రభుత్వానికి కేటాయించిన భూమిని ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడాన్ని బీఆర్ఎస్ గట్టిగా వ్యతిరేకిస్తోంది. ఈ మేరకు ఇటీవల కాలంలో వరుసగా ఆందోళన చేపట్టింది. ఆ భూమిని సేకరించినప్పుడు ఒక్కో రైతుకు ఎకరాకు రూ.11 వేలు ఇచ్చారని.. ఇప్పుడు రూ.వందల కోట్ల విలువైన ఆ భూములను ప్రైవేట్‌కి ఇవ్వడం సరికాదని వాదిస్తోంది.
ప్రభుత్వం ఏమన్నదంటే..
హై కోర్టులో జరిగిన వాదనల సందర్భంగా అడ్వకేట్ జనరల్ మాట్లాడుతూ.. ఒకప్పుడు ఆ భూములను ట్రక్కుల పార్కింగ్ కోసమే వాడారని వివరించారు. నగర అవసరాలు పెరిగిన నేపథ్యంలో.. ట్రక్కుల కోసం మరో చోట భూమిని ఇప్పటికే ప్రభుత్వం కేటాయించిందన్నారు. ఈ భూమిని వేలం వేయగా వచ్చిన డబ్బులతో ప్రభుత్వం పలు అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టనుందని పేర్కొన్నారు. ఇరు వర్గాల వాదనల అనంతరం, వేలం వేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

