కలం, కరీంనగర్: కార్తీక మాస పవిత్రతను చాటుతూ భక్తిభావాన్ని వెల్లివిరిసేలా కరీంనగర్లో కార్తీక దీపోత్సవాన్ని(Karthika Deepotsavam) ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కార్తీక దీపోత్సవ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు సుగుణాకర్ రావు తెలిపారు. ఈ నెల 29న ఆదివారం సాయంత్రం 5 గంటలకు కరీంనగర్లోని కేటీ కళ్యాణ మండపం ప్రాంగణంలో ఈ వేడుక నిర్వహించనున్నట్లు వెల్లడించారు. బ్రహ్మశ్రీ మహేశ్వర శర్మ మార్గదర్శనంలో జరిగే ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు.
శుక్రవారం టీటీడీ కళ్యాణ మండపంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హరిహరులకు అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో దీపారాధనకు విశేష ప్రాధాన్యం ఉందన్నారు. నదీ తీరాలకు వెళ్లి దీపోత్సవంలో పాల్గొనే అవకాశం లేని భక్తుల కోసం నగరంలోనే సామూహిక దీపోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ వేడుకలో ప్రతి భక్తుడికి స్వయంగా దీపం వెలిగించే అవకాశం కల్పించనున్నట్లు చెప్పారు. ఇందుకోసం ప్రమిదలు, నూనె, వత్తులను నిర్వాహకులు ఉచితంగా అందించనున్నారు. అలాగే భజనలు, భక్తిగీతాలు, భరతనాట్యం తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. మహిళలు, భజన బృందాలు, ఆధ్యాత్మిక సంఘాలు, వివిధ ఆలయాల కమిటీలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.

