అదరగొడుతున్న సెహ్వాగ్ తనయులు.. ఇద్దరూ ఇద్దరే!

కలం, స్పోర్ట్స్: భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender  Sehwag Sons) కుమారులు దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటారు. గురువారం పంజాబ్‌తో జరిగిన కూచ్ బెహార్ ట్రోఫీ మ్యాచ్‌లో 16 ఏళ్ల వేదాంత్ సెహ్వాగ్ ఏడు వికెట్లతో చెలరేగాడు. ఈ ఢిల్లీ అండర్-19 జట్టుకు 19 ఏళ్ల అన్న ఆర్యవీర్ సెహ్వాగ్ కెప్టెన్‌గా వ్యవహరించడం విశేషం. రోపర్‌లోని ప్రభుత్వ కళాశాల మైదానంలో తొలి రోజు ఆటలో ఢిల్లీ బౌలర్లు ఆధిపత్యం చూపారు. రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ వేదాంత్ 22.3 ఓవర్లలో 5 మెయిడిన్లు వేసి 88 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. దీంతో పంజాబ్ జట్టు 65.3 ఓవర్లలో 238 పరుగులకే ఆలౌటైంది.

పంజాబ్ టాప్ ఆర్డర్‌ను వేదాంత్ దెబ్బతీశాడు. భారత్ అండర్-19 ఆసియా కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన పంజాబ్ కెప్టెన్ అర్జున్ రాజ్‌పుత్ వికెట్‌ను కూడా వేదాంత్ ఖాతాలో వేసుకున్నాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ తరఫున ఆర్యవీర్ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. అర్ణవ్ బుగ్గాతో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించి, ద్వీప్ గల్హోత్రాతో రెండో వికెట్‌కు 66 పరుగులు జోడించాడు. 94 బంతుల్లో 31 పరుగులు చేసిన ఆర్యవీర్, లక్షయ్ కన్సల్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు.

2010 మే 4న జన్మించిన వేదాంత్ 2024 విజయ్ మర్చంట్ ట్రోఫీలోనూ పంజాబ్‌పై 4 వికెట్లు తీశాడు. మరోవైపు ఆర్యవీర్ ఇటీవల అండర్-19 ఆసియా కప్‌లో 361 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచాడు. అక్టోబర్‌లో వినూ మన్కడ్ ట్రోఫీలో 173 పరుగులు చేయగా, 2024 కూచ్ బెహార్ ట్రోఫీలో 297 పరుగులు సాధించాడు. ఇద్దరు సోదరులు ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో ఆడారు. 2026 సీజన్‌లో ఆర్యవీర్ వెస్ట్ ఢిల్లీ లయన్స్‌కు, వేదాంత్ సెంట్రల్ ఢిల్లీ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించారు. డిసెంబర్ 16న గోవాలో జరిగే ఐపీఎల్ 2027 వేలంలో ఆర్యవీర్ పేరు కూడా నమోదైంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>