కేంద్రంపై రైతు సంఘాల నిరసన గళం

కలం, మెదక్ బ్యూరో: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని, గిట్టుబాటు ధర కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తోందని రైతు సంఘాల నాయకులు (Farmers Unions) ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగించే విధంగా కేంద్ర ప్రభుత్వం విధానాలు రూపొందిస్తోందని విమర్శిస్తూ సంగారెడ్డి కొత్త బస్టాండ్ వద్ద రైతు సంఘం, సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏఐకేఎస్ రైతు సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు జయరాజు మాట్లాడుతూ.. రైతులకు పంట పెట్టుబడి ఖర్చుపై 50 శాతం లాభంతో కూడిన కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. రైతుల రుణాలను పూర్తిస్థాయిలో మాఫీ చేయాలని, విద్యుత్ ప్రైవేటీకరణను నిలిపివేయాలని, పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని కోరారు.

60 ఏళ్లు పైబడిన రైతులకు నెలకు రూ.10 వేల పెన్షన్ ఇవ్వాలని, ఉపాధి హామీ పథకం కింద సంవత్సరానికి 200 రోజుల పని కల్పించి రోజుకు రూ.700 కూలీ చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మిక వర్గానికి నష్టం కలిగించే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, రైతాంగానికి నష్టం కలిగించే అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయాలని కోరారు. రైతుల హక్కులు, కార్మికుల హక్కులు, కూలీల రక్షణ కోసం దేశవ్యాప్తంగా జరుగుతున్న పోరాటాలకు ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ నిరసన కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బి. మల్లేష్, జిల్లా కార్యదర్శి సాయిలు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి రమేష్ గౌడ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నర్సింలు, కుమార్, రాజు, దత్తు, కృష్ణ, యాదగౌడ్, మంజుల, సుజాత తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>