విద్యార్థుల హాజరు పెంపునకు ప్రత్యేక కార్యాచరణ: రాజర్షి షా

కలం, ఆదిలాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచడంతో పాటు, బడి మానేసే విద్యార్థుల సంఖ్యను పూర్తిగా తగ్గించేందుకు ఉపాధ్యాయులు సమష్టి బాధ్యతతో పనిచేయాలని జిల్లా కలెక్టర్‌ రాజర్షి షా (Rajarshi Shah) ఆదేశించారు. జిల్లాలోని 21 మండలాల్లో పాఠశాలల వారీగా ఎఫ్‌ఆర్‌ఎస్‌ నమోదు, ఖాన్‌ అకాడమీ అమలు తీరుపై గురువారం సాయంత్రం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఎంఈఓలు, ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ (Rajarshi Shah) మాట్లాడుతూ.. విద్యార్థులు పాఠశాలలకు క్రమం తప్పకుండా హాజరయ్యేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఎఫ్‌ఆర్‌ఎస్‌ నమోదు తక్కువగా ఉన్న పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సంబంధిత ఉపాధ్యాయులు విద్యార్థుల ఇళ్లకు స్వయంగా వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడాలని ఆదేశించారు. పిల్లలను తిరిగి పాఠశాలలకు పంపేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు.

రోజువారీ విద్యార్థుల హాజరును నిశితంగా పరిశీలించాలని, ఎవరైనా విద్యార్థి పాఠశాలకు రాకపోతే అందుకు గల కారణాలను వెంటనే గుర్తించి పరిష్కార చర్యలు చేపట్టాలని సూచించారు. ఏ ఒక్క విద్యార్థి చదువుకు దూరం కాకుండా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని స్పష్టం చేశారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న ప్రతి విద్యార్థిని ఖాన్‌ అకాడమీలో నమోదు చేయడంతో పాటు, డిజిటల్‌ పాఠ్యాంశాలను క్రమం తప్పకుండా అభ్యసించేలా ఉపాధ్యాయులు పర్యవేక్షించాలని కలెక్టర్‌ ఆదేశించారు.

కేవలం నమోదు ప్రక్రియతో సరిపెట్టకుండా విద్యార్థులు ఆన్‌లైన్‌ పాఠాలను ఎంతవరకు వినియోగించుకుంటున్నారో ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. ఏ పాఠశాలలోనైనా ఖాన్‌ అకాడమీ యాక్టివేషన్‌ 50 శాతం కంటే తక్కువగా ఉంటే సంబంధిత ప్రధానోపాధ్యాయులు వెంటనే ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని సూచించారు. శుక్రవారం నుంచే విద్యార్థులందరికీ ఖాన్‌ అకాడమీ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చి, వాటి వినియోగాన్ని పెంచాలని ఆదేశించారు.

విద్యా కార్యక్రమాల అమలులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రధానోపాధ్యాయులను కలెక్టర్‌ అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు. జిల్లాలోని 109 ఉన్నత పాఠశాలల్లో ఖాన్‌ అకాడమీ అమలులో విశేష ప్రతిభ కనబరిచిన పొన్నారి పాఠశాల హెచ్‌ఎం రాజశంకర్‌, వడ్డాడి పాఠశాల హెచ్‌ఎం భూమారెడ్డి, తాంసీ పాఠశాల హెచ్‌ఎం శ్రీకాంత్‌లను ప్రత్యేకంగా అభినందించారు.

అలాగే ఎఫ్‌ఆర్‌ఎస్‌ నమోదులో అత్యధిక ప్రగతి సాధించిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులను శాలువాలు కప్పి, మెమెంటోలు అందజేసి సత్కరించారు. విద్యార్థుల విద్యా ప్రమాణాల పెంపుతో పాటు ప్రభుత్వ విద్యా కార్యక్రమాల విజయవంతమైన అమలుకు కృషి చేయాలని కలెక్టర్‌ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారి మాధవి, సెక్టోరల్‌ అధికారులు లక్ష్మణ్‌, రఘురమణ, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>