కలం, వెబ్‌డెస్క్: ఎక్కడైనా పెళ్లిళ్లకు, శుభకార్యాలకు ప్రత్యేక ప్యాకేజీలతో కంపెనీలు ఆఫర్లు ప్రకటించడం చూస్తుంటాం. సీజన్లో ఇది మంచి బిజినెస్. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఇలాంటి కంపెనీలు చాలానే పుట్టుకొచ్చాయి. కానీ, ఢిల్లీలో ఓ వ్యక్తి వినూత్న ఆలోచనతో స్టార్టప్ బిజినెస్ మొదలుపెట్టాడు. మనిషి చనిపోయిన తర్వాత నిర్వహించే అంత్యక్రియలు నిర్వహించే స్టార్టప్‌ను (Funeral Startup) స్థాపించాడు. ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించి అంత్యక్రియలపై ఆఫర్లు ఇచ్చాడు.
మోక్ష్ వాయేజ్ (Moksh Voyage) అనే పేరుతో ఈ స్టార్టప్‌ను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ అంత్యక్రియలను గౌరవప్రదంగా, సంప్రదాయబద్ధంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు వివిధ ప్యాకేజీలను అందిస్తోంది. ఇందులో బేసిక్ ప్యాకేజీ రూ.49,999 తో ప్రారంభం అవుతుంది. ఇక స్టాండర్డ్ ప్యాకేజీ ధర రూ.99,999, ప్రీమియం ప్యాకేజీ ధర రూ.1,49,999 వరకు అందుబాటులో ఉన్నాయి. అంత్యక్రియలకు అవసరమైన ఏర్పాట్లు, పూల అలంకరణలు, ఇతర సేవలను ఒకే చోట అందిస్తారట. ఈ సంస్థకు సంబంధించిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. మనిషి చనిపోయి బాధలో ఉన్న వారితో వ్యాపారం చేయడం ఏమిటని విమర్శిస్తున్నారు. బాధలో ఉన్న వారికి వీలైతే ఓదార్పునందించాలి కానీ ఇలా వ్యవహరిచడం సరికాదని అభిప్రాయపడుతున్నారు.

