బావ‌ర్చీలో కాంగ్రెస్ వ‌ర్సెస్ బీఆర్ఎస్!

క‌లం, వెబ్‌డెస్క్‌: హైద‌రాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని బావ‌ర్చీ రెస్టారెంట్ (Bawarchi Restaurant) వద్ద గురువారం రాత్రి ఉద్రిక్త ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. బీఆర్ఎస్ నేత‌లు ఓ వ్య‌క్తికి రాహుల్ గాంధీ ఫేస్ మాస్క్ పెట్టి చేప‌ట్టిన నిర‌స‌న తీవ్ర దుమారం రేపింది. వివ‌రాల్లోకి వెళ్తే.. రాహుల్ గాంధీ తెలంగాణ‌ ఎన్నిక‌ల స‌మ‌యంలో 2 ల‌క్ష‌ల ఉద్యోగాలు ఇస్తాన‌ని హామీ ఇచ్చార‌ని, ఆ హామీ ఏమైంద‌ని ప్ర‌శ్నిస్తూ బీఆర్ఎస్ నేత‌లు మన్నె క్రిషాంక్, ముఠా జైసింహ, జగన్, దినేశ్ చౌదరి, విష్ణువర్ధన్ రెడ్డి, హరీశ్ రెడ్డి వినూత్న నిర‌న‌న చేప‌ట్టారు. బావ‌ర్చీలో రాహుల్ గాంధీ బొమ్మ‌కు బిర్యానీ వ‌డ్డిస్తూ డిన్న‌ర్ ప్రోగ్రాం నిర్వ‌హించారు.

దీనిపై స‌మాచారం అందుకున్న కాంగ్రెస్ నేత‌లు బావ‌ర్చీ వ‌ద్ద‌కు చేరుకున్నారు. రెస్టారెంట్‌లోకి ప్ర‌వేశించి బీఆర్ఎస్ నాయ‌కుల‌పై దాడికి పాల్ప‌డ్డారు. ఈ దాడిలో మ‌న్నె క్రిషాంక్ స‌హా ప‌లువురు బీఆర్ఎస్ నేత‌ల‌కు గాయాల‌య్యాయి. బీఆర్ఎస్ , కాంగ్రెస్ వ‌ర్గాల దాడిలో రెస్టారెంట్‌లో ఫ‌ర్నీచ‌ర్ ధ్వంస‌మైంది. ప‌రిస్థితి ఉద్రిక్తంగా మార‌డంతో పోలీసులు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. ఇరు వ‌ర్గాల‌ను చెద‌ర‌గొట్టారు. ప‌లువురు బీఆర్ఎస్ నాయ‌కులు కార్ల‌లో అక్క‌డి నుంచి త‌ప్పించుకొని ప‌రార‌య్యారు. ఈ దాడుల్లో వాహ‌నాలు కూడా ధ్వంస‌మ‌య్యాయి.

మూడేళ్ల క్రితం రాహుల్ గాంధీ ఇదే బావర్చీ రెస్టారెంట్‌కు వచ్చి బిర్యానీ తింటూ, థమ్సప్ తాగుతూ నిరుద్యోగులకు హామీ ఇచ్చార‌ని మ‌న్నె క్రిషాంక్ గుర్తు చేశారు. ఎన్నిక‌ల్లో గెలిచిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నార‌ని తెలిపారు. అధికారంలోకి వ‌చ్చి మూడేళ్లు గ‌డిచినా హామీలు నెర‌వేర్చుకోలేద‌న్నారు. అందుకే ఈ నిర‌స‌న కార్య‌క్ర‌మం చేప‌ట్టిన‌ట్లు తెలిపారు. ఇప్ప‌టికైనా 2 ల‌క్ష‌ల ఉద్యోగాలు ఇచ్చి, జాబ్ క్యాలెండ‌ర్ విడుద‌ల చేయాల‌న్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>