కలం, ఖమ్మం బ్యూరో: కొత్తగూడెం కార్మిక నేతలకు జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది. అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) జాతీయ సమితి (AITUC National Council) సభ్యులుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కంచర్ల జమలయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి నరాటి ప్రసాద్ ఎన్నికయ్యారు. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో ఐదు రోజులపాటు నిర్వహించిన ఏఐటీయూసీ జాతీయ మహాసభలు గురువారం ఘనంగా ముగిశాయి.
ఈ మహాసభల్లో నూతన జాతీయ సమితిని ఎన్నుకోగా, జిల్లా నుంచి కంచర్ల జమలయ్య తొలిసారిగా, నరాటి ప్రసాద్ రెండోసారి జాతీయ సమితి సభ్యులుగా ఎన్నికై జిల్లా కార్మిక లోకానికి గర్వకారణంగా నిలిచారు. ఈ సందర్భంగా నూతన జాతీయ సమితి సభ్యులు కంచర్ల జమలయ్య, నరాటి ప్రసాద్ మాట్లాడుతూ.. బెంగళూరులో జరిగిన జాతీయ మహాసభలు అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో విజయవంతమయ్యాయని తెలిపారు. ఈ మహాసభలు దేశవ్యాప్తంగా ఉన్న కార్మికవర్గానికి నూతన స్ఫూర్తిని నింపాయని, కార్మిక వర్గ ప్రయోజనాల పరిరక్షణ కోసం అనేక కీలక తీర్మానాలు చేశామని వెల్లడించారు.
కార్మిక హక్కుల సాధనే ప్రధాన ఎజెండాగా, వారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి జాతీయ మహాసభల స్ఫూర్తితో రాజీలేని పోరాటాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. మహాసభల తీర్మానాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లి కార్మికులను చైతన్యవంతులను చేస్తామని చెప్పారు. తమ ఎన్నికకు సహకరించిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషాకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కొత్తగూడెం నేతలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడంపై జిల్లాలోని ఏఐటీయూసీ అనుబంధ సంఘటిత, అసంఘటిత కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

