కలం, నిజామాబాద్ బ్యూరో: ప్రపంచంలోనే అత్యంత విశిష్టమైన రాజ్యాంగం భారతదేశానిది అని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. భారతీయ సంవిధాన్ ప్రచార దళ్ ఆధ్వర్యంలో రాజ్యాంగంపై అవగాహన (Constitution Awareness) కల్పించేందుకు గురువారం ఇందూరులోని పులాంగ్ చౌరస్తాలో ప్రచార రథం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకోవడమే కాకుండా.. ప్రతి పౌరుడికి అందించడం ముఖ్యమన్నారు. 2015లో నవంబర్ 26వ తేదీన రాజ్యాంగ దినోత్సవం అధికారికంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం ముఖ్యమైన ముందడుగు అన్నారు. అంబేద్కర్ జీవితంతో అనుబంధం ఉన్న ఐదు ప్రదేశాలను పంచ తీర్థాలుగా అభివృద్ధి చేయడం ద్వారా ఆయన వారసత్వానికి ప్రధాని మోదీ గౌరవం కల్పించారని పేర్కొన్నారు.
రాజ్యాంగం దేశానికి దిక్సూచి ప్రజాస్వామ్యం దేశానికి ప్రాణవాయువని అన్నారు. కావున ప్రతి ఒక్కరూ రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుతూ ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తూ సమానత్వం, సామాజిక న్యాయం కలిగిన సమాజ నిర్మాణం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, గైని గంగారాం తదితరులు పాల్గొన్నారు.

