తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలి: నిరంజన్‌రెడ్డి

కలం, వనపర్తి: రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నాయకుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి(Niranjan Reddy) విమర్శించారు. అకాల వర్షాలతో తడిసి, కొట్టుకుపోయిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి, రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా ఇప్పటివరకు ధాన్యం కొనుగోళ్లు చేపట్టకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ లెక్కల ప్రకారమే రాష్ట్రంలో 24.30 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని, అయినా రైతులకు ఇప్పటివరకు పరిహారం అందలేదని విమర్శించారు. సాగునీరు, విద్యుత్‌ సరఫరాలో వైఫల్యంతో పంటలు ఎండిపోయాయని, ఇప్పుడు అకాల వర్షాలతో ధాన్యం దెబ్బతింటున్నా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడం లేదన్నారు. గ్లోబల్‌ సమ్మిట్‌లు, రాజకీయ ప్రచారానికి ప్రాధాన్యమిస్తూ రైతుల సమస్యలను విస్మరిస్తోందని ఆరోపించారు. పెద్దమందడి మండలానికి కేఎల్‌ఐ ద్వారా సాగునీరు అందలేదని, పంపులు నడిపినా రైతులకు ప్రయోజనం కలగలేదన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఎండిన పంటలతో పాటు అకాల వర్షాలకు తడిసి, కొట్టుకుపోయిన ధాన్యానికి నష్టపరిహారం చెల్లించాలని, తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో వాకిటి శ్రీధర్, నందిమల్ల అశోక్, విజయ్‌కుమార్, కె.మాణిక్యం, గంధం పరంజ్యోతి, రఘువర్ధన్‌రెడ్డి, వేణుగోపాల్‌నాయుడు, ధర్మానాయక్, దేవర్ల నరసింహ, సునీల్‌ వాల్మీకి, జోహెబ్‌ హుస్సేన్, చిట్యాల రాము, సయ్యద్‌ జమీల్‌, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>