కలం, వెబ్ డెస్క్: ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత కాలంలో రాజ్యాంగ అక్షరాస్యత ఎంతో అవసరమని బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ (Dasoju Sravan) అభిప్రాయపడ్డారు. భవిష్యత్ తరాల కోసం రాజ్యాంగాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా గురువారం తెలంగాణ భవన్లో భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పలువురు నాయకులతో కలిసి ఆయన పుష్పాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది అని, ఓట్లను డబ్బుతో కొనుగోలు చేసే రాజకీయాలకు స్వస్తి పలకాలని అన్నారు. నోట్లతో ఓట్లు కొనుగోలు చేస్తూ.. ఓటుకు నోటు రాజకీయాలు చేసే నేతలు ముఖ్యమంత్రులుగా చలామణి అవుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి రాజకీయ డ్రామాలు ప్రజలు చరమగీతం పాడాలని అన్నారు. డా. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను స్మరిస్తూ రాజ్యాంగ పరిరక్షణకు పాటుపడాలని పిలుపునిచ్చారు.

