కలం, సినిమా: మాస్ మహారాజా రవితేజ హీరోగా, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుముడి’(Irumudi) సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. తండ్రీకూతుళ్ల అనుబంధం, భావోద్వేగాల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఆగస్టు 21న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా రూ.250 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
తాజాగా ఈ సినిమా విడుదలై ఈ నెల 28 నాటికి 100 రోజులు పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం అభిమానులకు ప్రత్యేక కానుక అందించేందుకు సిద్ధమైంది. 100 రోజుల వేడుకల్లో భాగంగా అదే రోజు రాత్రి ప్రత్యేక షోలు ప్రదర్శించనున్నారు. ఈ విషయాన్ని మైత్రి థియేటర్స్ యాజమాన్యం వెల్లడించింది. హైదరాబాద్లోని బాలానగర్ మైత్రి విమల్, దిల్సుఖ్నగర్ మైత్రి గంగా థియేటర్లలో ఈ ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నారు. ఈ షోలలో అభిమానుల కోసం ‘ఇరుముడి’ సినిమాలోని పాటలను రెండుసార్లు ప్లే చేయనున్నట్లు ప్రకటించారు.
ముఖ్యంగా ఈ చిత్రంలోని పాటలు థియేటర్లలో ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. ఇప్పుడు మరోసారి పెద్ద తెరపై తమ అభిమాన హీరో సినిమాను, పాటలను ఆస్వాదించే అవకాశం రావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటించగా, సాయికుమార్ కీలక పాత్రలో కనిపించారు. ప్రస్తుతం ‘ఇరుముడి’ సినిమా నెట్ఫ్లిక్స్లో తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంది.

