పత్తి చేనులో గంజాయి మొక్కలు.. పోలీసుల దాడితో గుట్టురట్టు!

కలం, నిర్మల్: పత్తి పంటలో అంతర పంటగా గంజాయి సాగు (Cannabis Cultivation) చేస్తున్న గుట్టును నిర్మల్ జిల్లా పోలీసులు రట్టు చేశారు. మామడ మండలం దంజీనాయక్ తండా పరిధిలో సాగు చేస్తున్న గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకుని, సాగుదారుడిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల వెల్లడించారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు.

మామడ మండలం తాండ్ర గ్రామపంచాయతీ పరిధిలోని దంజీనాయక్ తండాకు చెందిన కున్సోత్ రవి తనకున్న రెండున్నర ఎకరాల వ్యవసాయ భూమిలో పత్తి పంటతో పాటు అంతర పంటగా గంజాయి సాగు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ప్రత్యేక పోలీసు బృందాలు వ్యవసాయ క్షేత్రంపై దాడులు చేపట్టారు. ఈ తనిఖీల్లో 204 పచ్చి గంజాయి మొక్కలు, 54 ఎండిన గంజాయి మొక్కలతో పాటు ప్లాస్టిక్ సంచిలో నిల్వ ఉంచిన 5.320 కిలోల ఎండిన గంజాయి ఆకులను స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ సుమారు రూ.28.46 లక్షలు ఉంటుందని ఎస్పీ తెలిపారు.

గంజాయి సాగుకు పాల్పడుతున్న కున్సోత్ రవిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు. జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా గత కొన్ని రోజులుగా ప్రత్యేకంగా గంజాయి గస్తీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎక్కడైనా గంజాయి సాగు చేస్తున్నా, విక్రయిస్తున్నా ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, వాటికి బానిసలై భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. ఈ సమావేశంలో డీఎస్పీ శ్రీనివాస్, సోన్ సీఐ గోవర్ధన్ రెడ్డి, శిక్షణ డీఎస్పీలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>