కలం, వెబ్ డెస్క్ : ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల వేళ వైసీపీ అధినేత జగన్ కు ఊహించని షాక్ తగిలింది. వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురం మండలం పరిధిలోని జగన్ సొంత గ్రామమైన బలపనూరు పంచాయతీ (Balapanuru Panchayat) సర్పంచ్ స్థానాన్ని ఎన్డీయే కూటమి బలపరిచిన టీడీపీ అభ్యర్థి కొత్తరెడ్డి అనిల్‌కుమార్‌రెడ్డి ఏకగ్రీవంగా సర్పంచ్ పీఠాన్ని దక్కించుకున్నారు. సుమారు 2,269 మంది ఓటర్లు ఉన్న ఈ గ్రామంలో దాదాపు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత టీడీపీ మద్దతుదారుడు సర్పంచ్ పీఠాన్ని అధిరోహించడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
గతంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా హోరాహోరీ పోరుకు వేదికగా నిలిచే బలపనూరులో ఈసారి భిన్నమైన వాతావరణం కనిపించింది. పోటీకి వైసీపీ మద్దతుదారుల నుంచి ఎవరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో అనిల్‌కుమార్‌రెడ్డి ఎన్నిక ఏకగ్రీవంగా ఫిక్స్ అయింది. ఆసక్తికరంగా, ఇటీవల జరిగిన పరిషత్ ఎన్నికల్లో ఇదే బలపనూరు ఎంపీటీసీ స్థానాన్ని అనిల్‌కుమార్‌రెడ్డి కుటుంబానికి చెందిన కొత్తరెడ్డి రవిచంద్రారెడ్డి సైతం ఏకగ్రీవంగా గెలుచుకున్నారు. దీంతో గ్రామంలోని సర్పంచ్, ఎంపీటీసీ అనే రెండు కీలక పదవులూ ఒకే కుటుంబం చేతికి వచ్చినట్లయింది. అంతేకాదు సింహాద్రిపురం మండల వ్యాప్తంగా ఉన్న 20 పంచాయతీలకు గాను 18 చోట్ల కూటమి మద్దతుదారులే ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల సంఘం నివేదికలు పేర్కొంటున్నాయి.

