కలం, తాంసి: తాంసి మండలంలోని వామన్ నగర్ గ్రామంలో శ్రీ నారాయణ బాబా ఆశ్రమం వద్ద రూ.10 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన షెడ్డును బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్(Anil Jadhav) గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు గిరిజన సంప్రదాయ పద్ధతిలో డోలు వాయిద్యాలతో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వామన్ నగర్ గ్రామం తనకు ప్రత్యేకమైనదని, గ్రామ అభివృద్ధికి అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. గ్రామ ప్రజల చిరకాల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించేలా ఆర్టీసీ యాజమాన్యంతో మాట్లాడతానని, అదేవిధంగా రహదారి సమస్యను కూడా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

