గుకేశ్ వర్సెస్ సిందరోవ్.. విశ్వవిజేతగా నిలిచేదెవరు?

కలం, స్పోర్ట్స్: ప్రపంచ చెస్‌లో కొత్త తరం ఆధిపత్యం కోసం ఆసక్తికర పోరు మొదలైంది. ఒకవైపు ఇప్పటికే ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన భారత యువ ఆటగాడు డి. గుకేశ్.. మరోవైపు తొలిసారి ప్రపంచ టైటిల్ కోసం పోటీ పడుతున్న ఉజ్బెకిస్థాన్ గ్రాండ్‌మాస్టర్ జావోఖిర్ సిందరోవ్. ఇద్దరి వయసు 20 ఏళ్లే. ఇద్దరూ తమ ప్రతిభతో ప్రపంచ చెస్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇప్పుడు వీరిద్దరూ ప్రపంచ ఛాంపియన్‌షిప్ (World Chess Championship) టైటిల్ కోసం తలపడుతున్నారు. నవంబర్ 24న స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ప్రారంభమైన ఈ పోరు డిసెంబర్ 12 వరకు కొనసాగనుంది. తొలి గేమ్ డ్రాగా ముగియడంతో ఇద్దరూ చెరో అర పాయింట్ సాధించారు. నవంబర్ 25న రెండో గేమ్‌ కూడా డ్రా గా ముగిసింది. దీంతో ఈ ప్రపంచ టైటిల్ పోరు మరింత ఉత్కంఠగా మారింది.

గుకేశ్.. చిన్న వయసులోనే విశ్వవిజేత

చెన్నైకి చెందిన గుకేశ్ చిన్న వయసులోనే చెస్‌లో తన ప్రతిభను చాటుకున్నాడు. 2024లో అతడి కెరీర్‌లో చారిత్రాత్మక విజయం నమోదైంది. చైనా ఆటగాడు డింగ్ లిరెన్‌ను ఓడించి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు. అప్పటికి అతడి వయసు కేవలం 18 ఏళ్లు. దీంతో ప్రపంచ చెస్ చరిత్రలో అత్యంత పిన్న వయసులో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

ఇప్పుడు తొలిసారిగా తన టైటిల్‌ను కాపాడుకునేందుకు బరిలోకి దిగాడు. అయితే గత కొంతకాలంగా గుకేశ్ ఆటలో నిలకడ తగ్గింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో కూడా వెనుకబడ్డాడు. ప్రస్తుతం 26వ స్థానంలో ఉన్నాడు. అయినప్పటికీ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఆడిన అనుభవం అతడికి పెద్ద బలం.

సిందరోవ్.. అంచనాలను దాటుకుని..

ఉజ్బెకిస్థాన్‌కు చెందిన జావోఖిర్ సిందరోవ్ కూడా చిన్న వయసులోనే గ్రాండ్‌మాస్టర్‌గా ఎదిగాడు. 2025లో ఫిడే వరల్డ్ కప్ గెలుచుకుని తన సత్తా చాటాడు. ఆ తర్వాత 2026లో సైప్రస్‌లో జరిగిన క్యాండిడేట్స్ టోర్నీలోనూ అద్భుత ప్రదర్శన చేశాడు. ఒక్క ఓటమి లేకుండా 10 పాయింట్లు సాధించి విజేతగా నిలిచాడు. దీంతో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించాడు.

ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానంలో ఉన్నాడు. గుకేశ్‌తో పోలిస్తే మెరుగైన ఫామ్‌లో ఉండటంతో ఈసారి సిందరోవ్‌కే ఎక్కువ అవకాశాలున్నాయని పలువురు విశ్లేషిస్తున్నారు. తన తొలి ప్రపంచ టైటిల్‌ను సాధించాలనే పట్టుదలతో అతడు బరిలోకి దిగాడు.

ఈ ఫైట్ ఎందుకింత ప్రత్యేకం?

ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ చరిత్రలో ఇద్దరు 20 ఏళ్ల ఆటగాళ్లు తలపడటం ఇదే తొలిసారి. అందుకే ఈ పోరు చరిత్రలో ప్రత్యేకంగా నిలవనుంది. మరోవైపు ఈ ఇద్దరి ఆటతీరులోనూ చాలా తేడాలున్నాయి. గుకేశ్ క్లిష్ట పరిస్థితుల్లోనూ పోరాడే సామర్థ్యం కలిగిన ఆటగాడు. సిందరోవ్ మాత్రం దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచగలడు.

ర్యాంకింగ్స్‌లో సిందరోవ్ ముందున్నా.. ప్రపంచ టైటిల్ పోరులో గుకేశ్‌కు అనుభవం ఎక్కువ. ఇదే ఈ పోటీని మరింత ఆసక్తికరంగా మార్చింది. ఇద్దరూ యువ ఆటగాళ్లే కావడంతో రాబోయే రోజుల్లో ప్రపంచ చెస్‌లో ఎవరి ఆధిపత్యం కొనసాగుతుందన్న చర్చ కూడా మొదలైంది.

ఈ ఛాంపియన్‌షిప్‌లో గరిష్ఠంగా 14 క్లాసికల్ గేమ్‌లు జరుగుతాయి. ముందుగా 7.5 పాయింట్లు సాధించిన ఆటగాడు విజేతగా నిలుస్తాడు. 14 గేమ్‌ల తర్వాత స్కోరు 7-7తో సమమైతే టైబ్రేక్ నిర్వహిస్తారు. మొత్తం ప్రైజ్ మనీ 25 లక్షల డాలర్లు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>