కలం, తెలంగాణ బ్యూరో: భూ వివాదాల శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ల్యాండ్ డిజిటల్ సర్వే’ (Digital Land Survey) ఉపయోగపడుతున్నది. భూముల విస్తీర్ణం, సరిహద్దు, కో-ఆర్డినేట్స్, పక్కన ఉన్న భూముల వివరాలు.. ఇవన్నీ డిజిటల్ రూపంలో నిక్షిప్తమవుతున్నందున పట్టాదార్ పాస్‌బుక్‌లను కూడా దీనికి అనుగుణంగా తీర్చిదిద్దేలా రెవెన్యూ, వ్యవసాయ శాఖలు సంయుక్తంగా ప్లాన్ చేస్తున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 10,900 రెవెన్యూ గ్రామాల్లో ఈ తరహా సర్వేను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ పెట్టుకున్నది.
ఫస్ట్ ఫేజ్‌లో భాగంగా రెండున్నర వేల రెవెన్యూ గ్రామాలను రాష్ట్ర సర్కార్ ఎంపిక చేసింది. ఇప్పటికే సుమారు 2.35 కోట్ల ల్యాండ్ బిట్ల సర్వే పూర్తయినట్లు రాష్ట్ర రెవెన్యూ వర్గాల సమాచారం. ప్రతీ పాస్‌బుక్‌లో క్యూ ఆర్ కోడ్‌ను పెడుతున్నందున స్కాన్ చేయగానే భూమికి సంబంధించిన సమస్త సమాచారం వెల్లడవుతుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. దీని ఆధారంగానే ఇకపైన పలు రకాల సేవలను అనుసంధానం చేయాలన్నది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్దేశ్యమని తెలిపాయి.
ఐదు అంశాలతో డిజిటల్ సర్వేకు శ్రీకారం
కేంద్ర ప్రభుత్వం రూపొందించిన డిజిటల్ ల్యాండ్ సర్వే (Digital Land Survey) ద్వారా ఐదు అంశాల్లో చిక్కులు తొలగిపోతాయన్నది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాదన. ప్రతీ రైతు వివరాలతో డిజిటల్ రిజిస్ట్రీ ప్రభుత్వాల దగ్గర ఎల్లవేళలా అందుబాటులో ఉంటుంది. వీటి ఆధారంగానే పథకాల ప్రయోజనాలు రైతులకు అందుతాయి. ఇందుకోసం ప్రత్యేకంగా అగ్రి స్టాక్ (ప్రొక్యూర్మెంట్) కమిషనరేట్ ఏర్పాటవుతుంది. ఎరువుల పంపిణీ, విత్తనాల సరఫరా, పంటల బీమా మంజూరు, ఎంఎస్పీపై ధాన్యం సేకరణ.. ఇలాంటి వివరాలన్నీ అగ్రిస్టాక్ పోర్టల్‌తో అనుసంధానమవుతాయి.
ఇక రెండో అంశం యూరియా సహా అన్ని రకాల ఎరువులు, పురుగుమందుల సరఫరా ఫెర్టిలైజర్ యాప్ అనే మొబైల్ యాప్ ద్వారా రైతులకు సరఫరా అవుతాయి. మూడో అంశంగా, ల్యాండ్ సరిహద్దులు, విస్తీర్ణం, ఆ భూములో సాగుచేస్తున్న పంటల వివరాలు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి. నాల్గో అంశంగా సాగుభూముల వివరాలన్నీ డిజిటల్ రూపంలో అటు రైతుల దగ్గర ఉన్న పట్టాదార్ పాస్‌బుక్ (క్యూఆర్ కోడ్)లలో, ఇటు ప్రభుత్వ పోర్టల్‌లో స్టోర్ అయ్యి ఉంటాయి. చివరగా రైతులందరి వివరాలు డిజిటల్ రిజిస్ట్రీ రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర డేటా రూపంలో అందుబాటులో ఉంటాయి.
రైతుల అభ్యంతరాలకు 25 రోజుల గడువు
డిజిటల్ సర్వే కారణంగా ఇప్పటివరకూ రికార్డుల్లో ఉన్న విస్తీర్ణంతో తేడాలు వచ్చే అవకాశం లేకపోలేదు. గ్రామ పంచాయతీల్లోని కాలిబాటలు, కొన్ని సందర్భాల్లో వివిధ సర్వే నంబర్ల మధ్య ఉండే ఖాళీ స్థలం (ప్రభుత్వ) తదితరాలన్నింటిపై స్పష్టత వస్తుంది. దీంతో ఇంతకాలం రైతుల సాగులో ఉన్న భూముల విస్తీర్ణం తగ్గితే వివాదం వస్తుందని అంచనా వేసిన రెవెన్యూ అధికారులు అభ్యంతరాలను, ఫిర్యాదులను ఇవ్వడానికి పాతిక రోజుల గడువు ఇవ్వనున్నారు.
సమస్య పరిష్కారం తర్వాత పట్టా
భూ సమస్య పూర్తిగా పరిష్కారం అయిన తర్వాత పట్టాదార్ పాస్ బుక్ జారీ అవుతుంది. సర్వే పూర్తయిన తర్వాత 45 రోజుల వ్యవధిలో (అభ్యంతరాల గడువుతో కలిపి) క్యూఆర్ కోడ్‌తో కూడిన పాస్‌బుక్ జారీ చేయాలని రెవెన్యూ అధికారులు భావిస్తున్నారు. సర్వే తర్వాత నిర్ధారణ అయిన విస్తీర్ణమే ఫైనల్ అవుతుంది. దీన్ని ప్రామాణికంగా తీసుకుని ఎరువుల సప్లై, దిగుబడి అంచనా, కొనుగోలు కేంద్రాల్లో సేకరణ, రైతుభరోసా తదితరాలన్నీ అమలవుతాయి.
కేంద్ర సాయాన్ని అందుకున్న తొలి రాష్ట్రం తెలంగాణ
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ సంస్కరణను పకడ్బందీగా అమలు చేసినందుకు రెండు ఆర్థిక సంవత్సరాల్లో దశలవారీగా రూ.1,087.64 కోట్లను ‘సాస్కీ’ ద్వారా అందుకున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. వ్యవసాయ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు అమలు చేస్తున్న వినూత్న విధానాలు, నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించేలా సాధించిన పురోగతికి ఈ గుర్తింపు నిదర్శనమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల పేర్కొన్నారు.
ఫార్మర్ రిజిస్ట్రీ కార్యక్రమంలో కేంద్రం నిర్దేశించిన లక్ష్యాలకు మించి రైతుల ఐడీలను నమోదు చేసినందుకు రూ.422.64 కోట్ల ‘ప్రత్యేక కేంద్ర సహాయ’ నిధులు ఈ ఏడాది ఫిబ్రవరి 26న విడుదలయ్యాయి. కేంద్ర ప్రభుత్వ ఎరువుల యాప్ అమలుతో రూ.665 కోట్ల ప్రోత్సాహక నిధులు 3 విడతల్లో (ఫస్ట్ ఫేజ్ – రూ.175 కోట్లు, సెకండ్ ఫేజ్–రూ.165 కోట్లు, థర్డ్ ఫేజ్–రూ.325 కోట్లు) విడుదలయ్యాయి. రెండు ఆర్థిక సంవత్సరాలకు కలిపి తెలంగాణకు మొత్తం రూ.1,087.64 కోట్ల ‘ప్రత్యేక కేంద్ర సహాయం’ లభించిందని మంత్రి తుమ్మల ఈ నెల 18న వెల్లడించారు.
ఇకపై ధాన్యం విక్రయాలూ ఫార్మర్ రిజిస్ట్రీ ద్వారానే..
రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఫార్మర్ రిజిస్ట్రీలోని గణాంకాలను వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు. నిర్ధిష్టంగా ఒక రైతు తన పొలంలో ఎంత విస్తీర్ణంలో ఏ పంట సాగు చేస్తున్నారో అప్డేట్ చేయడం ద్వారా అవసరాల మేరకే యూరియా, మిగిలిన ఎరువులను యాప్ ద్వారా పొందే వీలుంటుంది. పంట దిగుబడిని కూడా అంచనా వేసి ఆ మేరకే కొనుగోలు కేంద్రాల్లో విక్రయించడానికి వీలు ఉంటుంది.
ఈ విక్రయాల ఆధారంగానే సన్న వడ్లకు రాష్ట్ర ప్రభుత్వ బోనస్ విడుదలవుతుంది. ఇకపైన కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన ద్వారా ఇచ్చే సాయం, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా తదితరాల కింద నిధుల విడుదల కూడా ఫార్మర్ రిజిస్ట్రీ ఐడీ ఆధారంగానే ఉంటాయి. ఇతర రాష్ట్రాల పంటను ఇక్కడి రైతుల పేర్లతో విక్రయించడానికి ఆస్కారం ఉండదనేది మంత్రి వాదన. క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేసినప్పుడు ఫార్మర్ రిజిస్ట్రీలోని వివరాలన్నీ వెల్లడవుతాయి.
Also Read : ఘోర విషాదం.. ట్యాంకర్ పేలి 31 మంది సజీవదహనం!
Follow Us On : WhatsApp

