కలం, యాదాద్రి భువనగిరి జిల్లా: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు పెండింగ్ కేసుల పరిష్కారమే లక్ష్యంగా జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ (SP Akshansh Yadav) పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. నేరాల నియంత్రణలో అలసత్వానికి తావులేకుండా, పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని అధికారులకు (Yadadri Police) స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని పోలీస్ స్టేషన్ల పనితీరుపై ఎస్పీ ప్రత్యేక దృష్టి సారించారు. భువనగిరి డీఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో నిర్వహించిన నెలవారీ నేర సమీక్ష సమావేశంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితులు, తీవ్రమైన నేరాలు, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులపై పోలీస్ స్టేషన్ల వారీగా సమగ్ర సమీక్ష నిర్వహించారు.
పెండింగ్ కేసులెన్ని? దర్యాప్తు ఎక్కడ ఆగింది?
ఏళ్ల తరబడి పరిష్కారం కాని కేసులపై ప్రత్యేక దృష్టి సారించిన ఎస్పీ.. ప్రతి కేసు దర్యాప్తు పురోగతిని పరిశీలించారు. నిందితుల గుర్తింపు, సాక్ష్యాధారాల సేకరణ, సాక్షుల విచారణలో జాప్యం ఎందుకు జరుగుతుందనే అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. కేసులను కేవలం నమోదు చేయడమే కాకుండా, న్యాయస్థానాల్లో నిందితులకు శిక్షలు పడేలా నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలని స్పష్టం చేశారు.
శాంతిభద్రతల విషయంలో రాజీ వద్దు!
జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఘటనలపై అప్రమత్తంగా ఉండాలని, నేరాల నివారణకు నిరంతర నిఘా కొనసాగించాలని సూచించారు. దొంగతనాలు, దోపిడీల నియంత్రణకు రాత్రి పెట్రోలింగ్‌ను పటిష్టం చేయాలని ఆదేశించారు. అత్యాచారం, పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, వరకట్న మరణాలు వంటి సున్నితమైన కేసుల్లో దర్యాప్తును వేగవంతం చేయాలని సూచించారు. బాధితులకు సత్వర న్యాయం అందేలా ప్రతి అధికారి బాధ్యతతో వ్యవహరించాలని స్పష్టం చేశారు.
స్టేషన్ల వారీగా పనితీరుపై నిఘా!
జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తామని, నేర నియంత్రణతో పాటు పెండింగ్ కేసుల పరిష్కారంలో సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ ఆదేశించారు. నేరాల నియంత్రణలో నిర్లక్ష్యం వద్దని.. పెండింగ్ కేసుల పరిష్కారంలో జాప్యం వద్దని స్పష్టం చేశారు. ప్రజలకు న్యాయం అందించడమే పోలీసుల ప్రథమ కర్తవ్యమని సూచించారు. నవంబర్ 25న నిర్వహించిన ఈ సమీక్ష సమావేశంలో అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణ, డీఎస్పీలు మధుసూదన్ రెడ్డి, శ్రీనివాస్ నాయుడు, రవీందర్, ప్రొబేషనరీ డీఎస్పీలు, సీఐలు, ఎస్హెచ్ఓలు, ఎస్ఐలు, ఇతర పోలీస్ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

