మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యం: ఎమ్మెల్యే యెన్నం

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించి, తమ కాళ్లపై తాము నిలబడేలా మరిన్ని నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) పేర్కొన్నారు. బుధవారం నగరంలోని అన్ని ప్రాంతాల మహిళలకు శిక్షణ అందుబాటులో ఉండేలా మరో రెండు, మూడు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలిపారు.

మహబూబ్‌నగర్‌లో సెట్విన్ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్‌ ఫస్ట్ శిక్షణ కేంద్రంలో నిర్వహిస్తున్న మహిళల నైపుణ్య శిక్షణ కేంద్రంలో శిక్షణ పోతుతున్న విద్యార్థులకు ఆయన స్టడీ మెటీరియల్స్ పంపిణీ చేశారు. ఈ కేంద్రంలో ఇప్పటికే ఆరు బ్యాచ్‌ల శిక్షణ పూర్తయిందని, ఏడో బ్యాచ్‌లో మహిళలు, విద్యార్థినులు ఉత్సాహంగా శిక్షణ పొందుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటివరకు సుమారు మూడు వేల మంది మహిళలు వివిధ కోర్సుల్లో శిక్షణ పొందడం అభినందనీయమన్నారు. ఈ విజయానికి కృషి చేస్తున్న నిర్వాహకులు, శిక్షకులు, సమన్వయకర్తలు, శిక్షణ పొందిన మహిళలందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

దేశ ఆర్థిక వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం పెరిగినప్పుడే కుటుంబాలు, సమాజం, రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయని ఆయన అన్నారు. సెట్విన్ ఆధ్వర్యంలో అందిస్తున్న శిక్షణ ప్రాథమిక నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ఉపయోగపడుతుందని, మూడు నెలల పాటు శ్రద్ధగా శిక్షణ పొందాలని, అనంతరం కంప్యూటర్ తదితర కోర్సుల్లో మరింత నైపుణ్యం సాధించాలనుకునే వారు టాస్క్ కేంద్రం ద్వారా అడ్వాన్స్‌డ్ కోర్సులను అభ్యసించాలని సూచించారు.

ప్రైవేట్ సంస్థల సర్టిఫికెట్లతో పోలిస్తే ప్రభుత్వ గుర్తింపు కలిగిన సంస్థల ద్వారా పొందే ధ్రువీకరణ పత్రాలు ఉపాధి అవకాశాల కోసం ఉపయోగపడతాయని అన్నారు. శిక్షణ అనంతరం నేర్చుకున్న నైపుణ్యాలను ఆచరణలో పెట్టాలని, సొంతంగా చిన్న వ్యాపారాలు ప్రారంభించడం లేదా ఇతర ఉపాధి మార్గాలను ఎంచుకోవడం ద్వారా ఆర్థిక స్వావలంబన సాధించాలని సూచించారు. శిక్షణ పూర్తిచేసుకున్న మహిళలు స్వయం ఉపాధి ప్రారంభించేందుకు ఆసక్తి చూపితే బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేసి రుణ అవకాశాలను పరిశీలిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.

గతంలోనూ ఈ తరహా సమావేశాలు నిర్వహించామని, ప్రస్తుత బ్యాచ్‌తో పాటు గత బ్యాచ్‌ల మహిళలను కూడా కలిపి రుణమేళా నిర్వహించే ఆలోచన ఉందన్నారు. వ్యాపారం ప్రారంభించాలనుకునే మహిళలు రెండు, మూడు పేజీలతో కూడిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధం చేసుకుంటే బ్యాంకర్లతో చర్చించి అవసరమైన రుణ సదుపాయాల కల్పనకు ప్రయత్నిస్తామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిరాజ్ ఖాద్రీ, మహబూబ్‌నగర్‌ ఫస్ట్ పర్యవేక్షకులు గుండా మనోహర్, ఇంచార్జీ నిజలింగప్ప తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>