కలం, సినిమా: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆదర్శ కుటుంబం’(Aadarsha Kutumbam) సినిమాలో తనకు అన్యాయం జరిగిందని నటి పూజిత పొన్నాడ (Pujita Ponnada) ఆవేదన వ్యక్తం చేసింది. తొలుత పూర్తిస్థాయి పాత్ర ఉందని చెప్పి, యూకే నుంచి జనవరిలో హైదరాబాద్‌కు పిలిపించారని.. ఒక షెడ్యూల్ షూటింగ్ కూడా నిర్వహించారని, ఎంట్రీ సీక్వెన్స్‌తో పాటు యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారని తెలిపింది.
షూటింగ్ అనంతరం తన నటన బాగుందని చిత్ర బృందం ప్రశంసించినట్లు ఆమె పేర్కొంది. అయితే నాలుగు నెలలు గడిచినా రెండో షెడ్యూల్‌కు పిలుపు రాకపోవడంతో ఆరా తీశానని, మొదటి షెడ్యూల్‌లో పనిచేసిన నటీనటులతో పాటు సినిమాటోగ్రాఫర్‌ను కూడా మార్చినట్లు తెలిసిందని పూజిత వెల్లడించింది. ఈ పరిణామంపై ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

