కలం, వెబ్ డెస్క్ : నంద్యాల (Nandyal Fire Accident) జిల్లా కొత్తపల్లి మండలం ఎర్రమఠం పంచాయతీ పరిధిలోని బలపాలతిప్ప గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గిరిజన దంపతులు కాట్రాజు ఈరన్న, భారతమ్మ దంపతుల ఇంట్లో సోలార్ బ్యాటరీలో అకస్మాత్తుగా షార్ట్ సర్క్యూట్ సంభవించి భారీ శబ్దంతో పేలిపోయింది. భారతమ్మ తన చిన్న కుమారుడు ధర్మకిరణ్(5)ను గుడిసెలో నిద్రపుచ్చి ఇంటి వెనుక బట్టలు ఉతుకున్న వేళ ఈ ప్రమాదం జరిగింది. బిడ్డను కాపాడుకునేందుకు తల్లి భారతమ్మ, స్థానికులు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో లోపలికి వెళ్లలేకపోయారు.
దీంతో ఈ అగ్నిప్రమాదంలో చిన్నారి మంటల్లో చిక్కుకుని సజీవదహనం కావడంతో పాటు, ఇంట్లో నిల్వ ఉంచిన బియ్యం, ఇతర నిత్యావసర సామగ్రి పూర్తిగా కాలిబూడిదై సుమారు రూ. లక్ష వరకు ఆస్తి నష్టం వాటిల్లింది. కళ్లెదుటే కన్నకొడుకు అగ్నికి ఆహుతి కావడంతో ఆ తల్లి చేసిన ఆర్తనాదాలు గ్రామస్థులను కంటతడి పెట్టించాయి. సమాచారం అందుకున్న కొత్తపల్లి తహసీల్దార్ ఉషారాణి, స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

