కలం, కరీంనగర్ బ్యూరో: మంథని నియోజకవర్గ పరిధిలోని బొగ్గు నిక్షేపాలను వెలికితీసి, మారుమూల ప్రాంతమైన తమ ప్రాంత యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చల్లా నారాయణ రెడ్డి (Challa Narayana Reddy) కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు.
కాటారం మండలం గుండ్రాత్ పల్లి (నస్తూర్ పల్లి), మహాదేవపూర్ మండలం సండ్రుపల్లి గ్రామ పరిసర ప్రాంతాల్లో గణనీయమైన స్థాయిలో బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. తాడిచర్లలో ఉన్న బొగ్గు కన్నా అత్యంత నాణ్యమైన బొగ్గు ఇక్కడ ఉన్నట్లు సర్వేల్లో వెల్లడైందని ఆయన మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర గనుల శాఖ , సింగరేణి సంస్థ ద్వారా ఈ ప్రాంతాల్లో సమగ్ర భౌగోళిక సర్వే నిర్వహించి, బొగ్గు నిల్వల పరిమాణం, నాణ్యతపై అధికారిక నివేదిక రూపొందించాలని కోరారు.
బొగ్గు ఉత్పత్తి కార్యకలాపాలను ప్రారంభించేందుకు అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. బొగ్గు వెలికితీత ద్వారా ఈ ప్రాంతాన్ని బొగ్గు ఆధారిత పారిశ్రామిక అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దాలని, తద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరడంతో పాటు గ్రామీణ ప్రాంతాలకు ఆర్థిక అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. మారుమూల ప్రాంతం కావడంతో స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలలో ప్రథమ ప్రాధాన్యత కల్పించాలని కోరారు.
చల్లా నారాయణ రెడ్డి (Challa Narayana Reddy) విజ్ఞప్తి పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. సండ్రుపల్లి, గుండ్రాత్ పల్లి ప్రాంతాల్లో ఉన్న బొగ్గు నిక్షేపాలపై అధికారులతో సమగ్ర సర్వే చేపట్టి, త్వరితగతిన నివేదిక అందించాలని సంబంధిత అధికారులకు సూచించారు. మంథని ప్రాంత అభివృద్ధికి, స్థానిక ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.
Also Read : ట్రక్ పార్క్ భూముల వేలం రద్దు చేయాలి : కేటీఆర్ డిమాండ్
Follow Us On : WhatsApp

