భాగ్యనగరంలో ‘పాడ్ ట్యాక్సీ’.. రెండు రూట్లు ఖరారు!

కలం, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని పర్సనల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (పీఆర్టీఎస్) (Hyderabad Pod Taxis)పై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. నగరంలోని రెండు రూట్లలో పాడ్ ట్యాక్సీలను నడిపేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మంగళవారం ఎంసీఆర్‌‌హెచ్‌ఆర్‌‌డీలో పట్టణాభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ పీఆర్టీఎస్ సాధ్యమవుతుందో స్టడీ చేసిన పురపాలక శాఖ అధికారులు.. ఫీజిబిలిటీ నివేదికను ముఖ్యమంత్రికి అందజేశారు.

మొదటి రూట్‌లో కూకట్‌పల్లి నుంచి రాయదుర్గం మీదుగా బయోడైవర్సిటీ వరకు.. రెండో రూట్‌లో బేగంపేట్ మెట్రో స్టేషన్ నుంచి సెక్రటేరియెట్, బషీర్‌బాగ్ మీదుగా రాణిగంజ్ వరకు అలైన్‌మెంట్‌కు అవసరమైన సాధ్యాసాధ్యాలను వివరించారు. ఈ విధానం అమలు చేయాలంటే నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా, రాయదుర్గంలో డిపోలను నిర్మించాల్సి ఉంటుందని తెలిపారు. అందుకు అనువైన స్థలాలను గుర్తించాలని ఆదేశించిన ముఖ్యమంత్రి.. వాటి పక్కనే మల్టీ లెవల్ పార్కింగ్ ప్లాన్ చేయాలని సూచించారు.

త్వరలో రోడ్‌మ్యాప్

పీఆర్టీఎస్ అమలుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రతిపాదించిన రెండు రూట్ల నిర్మాణం, డిపోలను సిద్ధం చేయడం, ఇతర టెక్నికల్ అంశాలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి రోడ్‌మ్యాప్ సిద్ధం చేయాలని సూచించారు. పీఆర్టీఎస్ ఫస్ట్ ఫేజ్ పనుల్లో భాగంగా ఈ రెండు రూట్లలో పాడ్ ట్యాక్సీలు తిరగనున్నాయి. టెక్నికల్ చిక్కులను అధిగమించడం, సమగ్ర ప్రాజెక్టు నివేదిక, టెండర్ ప్రక్రియ, వివిధ విభాగాల సమన్వయంతో ఈ విధానానికి అవసరమైన మౌలిక సౌకర్యాల కల్పన.. ఇవన్నీ దాటి ఫంక్షనింగ్‌లోకి తీసుకురావడంపై తదుపరి సమావేశాల్లో అధికారులు రోడ్ మ్యాప్ ఇవ్వనున్నారు.

జనవరిలో మూసీ ఫస్ట్ ఫేజ్‌

మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు ఫస్ట్ ఫేజ్ పనులను వచ్చే ఏడాది జనవరిలో మొదలుపెట్టేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఫస్ట్ ఫేజ్‌లో హిమాయత్‌సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 9.20 కిలోమీటర్ల ప్రాంతాన్ని జోన్-1ఏ, ఉస్మాన్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 11.8 కిలోమీటర్ల ప్రాంతాన్ని జోన్-1బీ అని విభజించి పనులను చేపట్టనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఫేజ్-1 టెండర్ల ప్రక్రియను ప్రారంభించినట్లు వివరించారు. మీరాలం ట్యాంక్ అభివృద్ధి పనుల పురోగతిపైనా సీఎం ఆరా తీశారు. 2028 జనవరి నాటికి పూర్తి చేయడమే లక్ష్యంగా పనులు వేగంగా చేస్తున్నట్టు ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. చెరువులో చాలాకాలంగా పేరుకుపోయిన పూడికను తొలగించాలని అధికారులను సీఎం ఆదేశించారు.

పనుల్లో వేగం పెంచండి

రేడియల్ రోడ్ల నిర్మాణం, భూసేకరణలో వేగం పెంచాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. గండిపేట దగ్గర నిర్మాణంలో ఉన్న ఆధునిక గోశాల పనులను 2027 మార్చి నాటికి పూర్తి చేయాలని సూచించారు. చెరువుల పునరుద్ధరణ, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరించారు. చెరువుల పునరుద్ధరణలో భాగంగా అవసరమైన చోట ఎస్టీపీల ఏర్పాటు ప్రతిపాదనలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఎస్టీపీల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని అధికారులకు సీఎం సూచించారు. హైదరాబాద్ నగరంలో మెట్ల బావుల పునరుద్ధరణ విషయంలోనూ అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

కోహెడలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్ అభివృద్ధి పనుల పురోగతిపై ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. పనుల్లో వేగం పెంచాలని సూచించారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని స్పష్టం చేశారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ట్రిపుల్ ఐటీ జంక్షన్ దగ్గర ఫుట్ ఓవర్ బ్రిడ్జికి సంబంధించి పలు డిజైన్లను అధికారులు సీఎంకు చూపించారు. వాటిని పరిశీలించి పలు సూచనలు చేశారు. బ్రిడ్జి సమీపంలో మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>