కలం, వెబ్‌డెస్క్: హైదరాబాద్ పోలీసులకు వచ్చిన బాంబు బెదిరింపు (Hyderabad Bomb Threat) ఈమెయిల్ వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ బెదిరింపు సందేశాన్ని తాత్కాలిక ఈమెయిల్ ఐడీ ద్వారా పంపినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. జపాన్‌కు చెందిన తాత్కాలిక ఈమెయిల్ సేవలు అందించే వెబ్‌సైట్ ద్వారా ఐడీని సృష్టించి, మెయిల్ పంపిన అనంతరం దాన్ని తొలగించినట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా పంపిన వ్యక్తి అసలు గుర్తింపు, ప్రాంతాన్ని దాచేందుకు వీపీఎన్ సేవలను ఉపయోగించారా అనే కోణంలోనూ విచారణ చేపట్టారు.
ఈ కేసుపై సైబర్ క్రైమ్ డీసీపీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ.. బెదిరింపు ఈమెయిల్‌కు సంబంధించిన సాంకేతిక ఆధారాలను నిపుణుల బృందం విశ్లేషిస్తోందని తెలిపారు. విదేశాలకు చెందిన కొన్ని ఐపీ అడ్రస్‌లను కూడా గుర్తించామని, ఈమెయిల్ భారత్ నుంచి వచ్చిందా ?లేక విదేశాల నుంచి పంపించారా? అనే విషయాన్ని నిర్ధారిస్తున్నామని చెప్పారు. బెదిరింపు వెనుక ఆకతాయితనం ఉందా? లేక పెద్ద కుట్ర ఏదైనా ఉందా? అనే కోణాల్లోనూ దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు. బాంబు బెదిరింపు నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమై అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. నగరంలో 24 గంటల పాటు పెట్రోలింగ్‌ను ముమ్మరం చేయడంతో పాటు డాగ్ స్క్వాడ్‌లతో తనిఖీలు చేపడుతున్నారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డీసీపీ భరోసా ఇచ్చారు. బెదిరింపు సందేశాలు పంపిన వారిని గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

