కలం, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో నవంబర్ 25 నుంచి మూడు రోజుల పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నషాముక్త్ భారత్ పాదయాత్ర కొనసాగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈ పాదయాత్ర సందర్భంగా హైదరాబాద్ ట్రాఫిక్ (Hyderabad Traffic) పోలీసులు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు విధించారు. అంబర్‌పేట ఎంసీహెచ్ గ్రౌండ్ నుంచి ముషీరాబాద్‌లోని కాశీష్ ఫంక్షన్ హాల్ వరకు ఈ పాదయాత్ర కొనసాగనుంది. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉండటంతో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు అవసరాన్ని బట్టి వాహనాలను దారి మళ్లించనున్నారు. మహంకాళి ఆలయం, అంబర్‌పేట టీ జంక్షన్, 6 నంబర్ జంక్షన్, తిలక్‌నగర్, ఫీవర్ ఆసుపత్రి, హిందీ మహావిద్యాలయ, విద్యానగర్, ఉస్మానియా యూనివర్సిటీ, ఈఎఫ్ఎల్యూ, సీతాఫల్మండి, చిలకలగూడ, పద్మారావునగర్, గాంధీ ఆసుపత్రి మీదుగా పాదయాత్ర కాశీష్ ఫంక్షన్ హాల్‌కు చేరుకోనుంది.
ఈ నేపథ్యంలో అంబర్‌పేట, రామంతాపూర్, గోల్నాక, తిలక్‌నగర్, విద్యానగర్, నల్లకుంట, ఉస్మానియా యూనివర్సిటీ, చిలకలగూడ, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ తదితర ప్రాంతాల్లో వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించనున్నారు. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను గమనించి, ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని, ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని అధికారులు సూచించారు. తాజా ట్రాఫిక్ సమాచారం కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల అధికారిక సోషల్ మీడియా ఖాతాలను అనుసరించాలని కోరారు.

