కలం, నిర్మల్: జిల్లా వ్యాప్తంగా పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై పోలీసులు (Nirmal Police) ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. భైంసా ఏఎస్పీ సాయి కిరణ్, నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కోప్ట చట్టం – 2003 అమలుపై జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో దుకాణదారులకు మంగళవారం నోటీసులు జారీ చేసి అవగాహన కల్పించారు. 18 ఏళ్లలోపు వారికి పొగాకు ఉత్పత్తులు విక్రయించరాదని, విద్యాసంస్థలకు 100 గజాల పరిధిలో పొగాకు విక్రయాలు నిషేధమని పోలీసులు స్పష్టం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేయరాదని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పిల్లలను పొగాకు అలవాట్లకు దూరంగా ఉంచి ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పోలీసులు కోరారు.

