కలం, భువనగిరి: కృష్ణా జలాల (Krishna Water) విషయంలో బీఆర్ఎస్ నేతలు హరీశ్ రావు, కేటీఆర్ తప్పుడు లెక్కలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar Reddy) ఆరోపించారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత గత మూడేళ్లుగా ఫామ్‌హౌస్‌కే పరిమితమైన కేసీఆర్ గురించి గొప్పలు చెబుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేయడం హాస్యాస్పదమని ఆయన విమర్శించారు.
మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో చామల కిరణ్ కుమార్ రెడ్డి(MP Chamala) మాట్లాడుతూ.. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే దక్షిణ తెలంగాణ రైతులకు తీవ్ర నష్టం చేకూర్చాయని పేర్కొన్నారు. 2013లో జూరాల నుంచి నీటిని తీసుకునేలా జీవో 72 జారీ కాగా, 2015లో జీవో 105 ద్వారా ప్రాజెక్టు సోర్స్‌ను శ్రీశైలానికి మార్చడం వల్ల లిఫ్టులు, పంపుల సంఖ్య పెరిగి ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.30 వేల కోట్ల పైచిలుకు నుంచి రూ.80 వేల కోట్ల పైచిలుకు చేరినా ప్రాజెక్టును పూర్తి చేయలేదని ఎండగట్టారు.
అంతేకాకుండా ఎస్ఎల్బీసీ(SLBC), కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులను కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, 2014కు ముందు జరిగిన సుమారు 80 వేల ఎకరాల భూసేకరణ తప్ప తమ హయాంలో పెద్దగా భూసేకరణ చేయలేదని ఆయన విమర్శించారు. 2015లోనే కృష్ణా జలాల్లో 299 టీఎంసీల తాత్కాలిక పంపిణీకి నాటి ప్రభుత్వం అంగీకరించిన విషయాన్ని చామల గుర్తు చేశారు. 2019, 2020లలో నాటి ఏపీ సీఎం జగన్‌తో ప్రగతిభవన్ సమావేశాలు, విందు భేటీల తర్వాత 2020లో రాయలసీమ లిఫ్ట్ జీవో 203 వచ్చినప్పుడు, 2020 ఆగస్టు 5న జరగాల్సిన అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఎందుకు వాయిదా వేయించారో బీఆర్ఎస్ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు.
పల్నాడు వాటర్ గ్రిడ్‌కు సంబంధించిన జీవో 56 కూడా 2022 ఫిబ్రవరి 16నే వచ్చిందని, అన్ని విషయాలు రికార్డుల్లో స్పష్టంగా ఉన్నప్పటికీ ఇప్పుడే ప్రారంభమైనట్లు తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు. తమ ప్రభుత్వానికి దోచుకునే అలవాటు, కమీషన్ల ఆలోచన లేదని, పాలమూరు–రంగారెడ్డికి జాతీయ హోదా సాధించేందుకు నిరంతరం పోరాడుతున్నామని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో 2047 నాటికి తెలంగాణను ‘త్రీ ట్రిలియన్ ఎకానమీ’గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని పేర్కొంటూ, ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిన బీఆర్ఎస్ నేతలు ఇకనైనా తప్పుడు ప్రచారాలు బంద్ చేయాలని హితవు పలికారు.
Also Read : రాజీవ్ గాంధీ చనిపోవాలనే అలా చేశారు: రాహుల్
Follow Us On : WhatsApp

