కలం, వెబ్ డెస్క్ : ‘సర్’ ప్రక్రియను అడ్డుపెట్టుకుని దేశవ్యాప్తంగా అర్హులైన పౌరుల ఓటు హక్కును కాలరాసే కుట్ర జరుగుతోందని తెలంగాణ బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ఫైర్ అయ్యారు. ‘సర్’ ప్రక్రియ ద్వారా ఇప్పటికే తెలంగాణలో సుమారు 70 లక్షలు, ఒక్క హైదరాబాద్ నగరంలోనే 40 లక్షలకు పైగా ఓట్లను తొలగించారని ఆరోపించారు. ఎన్నికల డేటాలో అవకతవకలు, ఎన్నికల సంఘం స్వతంత్రతపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆధారాలతో సహా సంధిస్తున్న ప్రశ్నలకు బీజేపీ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
తాము అక్రమ చొరబాటుదారుల ఓట్లను కాపాడాలని ఎక్కడా కోరడం లేదని మంత్రి స్పష్టం చేశారు. గత దశాబ్ద కాలంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉన్నప్పుడు విదేశీ చొరబాటుదారులు దేశంలోకి ఎలా ప్రవేశించి ఓటర్లుగా మారుతున్నారని నిలదీశారు. సరిహద్దు భద్రతను పర్యవేక్షించే కేంద్ర హోంమంత్రి అక్రమ చొరబాట్లు జరగకుండా ఏం చేస్తున్నారో ప్రజలకు వివరించాలని ప్రశ్నించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ కరీంనగర్ గడ్డపైకి వచ్చి రాహుల్ గాంధీపై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. గత 12 ఏళ్ల పాలనలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి చేసిన అభివృద్ధి ఏమిటో, ప్రత్యేకంగా ఎన్ని నిధులు తీసుకొచ్చారో చెప్పే దమ్ము నితిన్ నబిన్ కు గానీ, బీజేపీ నేతలకు గానీ ఉందా? అని నిలదీశారు.
ఒకవైపు రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్య సంస్థలను బలహీనపరుస్తూ, మరోవైపు రాజ్యాంగ పరిరక్షణ పేరుతో యాత్రలు నిర్వహించడం బీజేపీ ద్వంద్వ నీతికి నిదర్శనమని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. కేవలం మతపరమైన భావోద్వేగాలు, విద్వేష రాజకీయాలను రెచ్చగొట్టి ప్రజలను ఎల్లకాలం మభ్యపెట్టలేరని హెచ్చరించారు. దేశ ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలు, ప్రతి పౌరుడి ఓటు హక్కును కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని గుర్తుచేస్తూ.. ‘సర్’ ప్రక్రియలో జరుగుతున్న అవకతవకలపై పార్లమెంటులో ప్రత్యేక చర్చకు బీజేపీ సిద్ధం కావాలని పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు.

