గోదావరి పుష్కరాలపై సమీక్ష.. పాల్గొన్న భద్రాద్రి కలెక్టర్ అంకిత్

కలం, ఖమ్మం బ్యూరో: ​2027లో నిర్వహించనున్న గోదావరి పుష్కరాలకు (Godavari Pushkaralu 2027) పక్కా ప్రణాళికతో సిద్ధం కావాలని, పెండింగ్‌లో ఉన్న తాత్కాలిక పనుల ప్రతిపాదనలను నవంబర్ 27వ తేదీలోగా సమర్పించాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ అధికారులను ఆదేశించారు. పుష్కర ఘాట్ల నిర్మాణం, దేవాలయాల అభివృద్ధి, రహదారుల విస్తరణ పనులను వేగవంతంగా పూర్తి చేసి, వాటికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు.

​సోమవారం హైదరాబాద్ నుంచి గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సంబంధిత జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో శైలజా రామయ్యర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఐడీఓసీ కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ అంకిత్ (Collector Ankit) ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శైలజా రామయ్యర్ మాట్లాడుతూ, 2027 గోదావరి పుష్కరాలకు సంబంధించి చేపట్టాల్సిన తాత్కాలిక పనుల ప్రతిపాదనలు ఏమైనా పెండింగ్‌లో ఉంటే నవంబర్ 27వ తేదీలోగా సమర్పించాలని ఆదేశించారు. ఘాట్ల నిర్మాణం, దేవాలయాల అభివృద్ధి, రహదారుల విస్తరణ పనులను త్వరితగతిన ప్రారంభించి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు.

​అభివృద్ధి పనుల పురోగతిని సంబంధిత శాఖల అధికారులు నిరంతరం సమీక్షిస్తూ, ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు. నిర్మాణ పనుల్లో నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడవద్దని స్పష్టం చేశారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ నిర్ణీత గడువులోగా పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

​పుష్కరాల సందర్భంగా దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని శైలజా రామయ్యర్ సూచించారు. పుష్కర స్నానాలు ఆచరించిన అనంతరం భక్తులు సమీపంలోని దేవాలయాలను దర్శించుకునేందుకు వీలుగా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని తెలిపారు. ఆలయాల పరిసరాల అభివృద్ధి, భక్తుల రాకపోకలకు అనువైన సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ​పుష్కరాలకు వచ్చే భక్తుల సంఖ్య, రద్దీని దృష్టిలో ఉంచుకుని కొత్త పుష్కర ఘాట్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, ప్రస్తుతం ఉన్న ఘాట్లను అవసరాలకు అనుగుణంగా విస్తరించి అభివృద్ధి చేయాలని సూచించారు.

ఘాట్లకు అనుసంధానంగా రహదారుల విస్తరణ పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. పుష్కరాల నిర్వహణకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను సమకూర్చేందుకు శాఖల వారీగా కార్యాచరణ రూపొందించి పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సీపీఓ సునీత, భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఈఓ దామోదర్ రావు, నీటిపారుదల శాఖ, పంచాయతీరాజ్ శాఖ, మున్సిపల్ శాఖల అధికారులు, ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>