సీహెచ్‌సీ స్థాయిలోనే క్లిష్ట శస్త్రచికిత్సలు.. పాల్వంచ వైద్య బృందం ఘనత

కలం, ఖమ్మం బ్యూరో: కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ) స్థాయిలోనే అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సలను సమర్థవంతంగా నిర్వహిస్తూ భద్రాద్రి కొత్తగూడెం పాల్వంచ సీహెచ్‌సీ వైద్య బృందం (Palvancha CHC) అరుదైన ఘనత సాధించింది. సాధారణంగా అనేక ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్వహించేందుకు వెనుకాడే మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలలో (Knee Replacement Surgeries) వరుసగా మూడు విజయాలతో హ్యాట్రిక్ నమోదు చేసింది. ఇప్పటికే రెండు మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేసిన బృందం, తాజాగా సోమవారం మూడో కేసును కూడా విజయవంతంగా నిర్వహించి ప్రభుత్వ వైద్యరంగంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రత్యేకతను మరోసారి చాటుకుంది. వినూత్న వైద్య సేవలందించినందుకు ఈ ఆసుపత్రికి గతంలోనే రాష్ట్రస్థాయి అవార్డు లభించడం విశేషం.

​కొత్తగూడెం పట్టణంలోని రామాంజనేయ కాలనీకి చెందిన కటికల నాగేంద్రమ్మ (60) గత రెండేళ్లుగా కుడి మోకాలి తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నారు. ఆమెకు పాల్వంచ సీహెచ్‌సీలో టోటల్ నీ రీప్లేస్‌మెంట్ (TKR) శస్త్రచికిత్సను ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ వరుణ్ కుమార్ విజయవంతంగా నిర్వహించారు. అనస్థీషియాలజిస్ట్ డాక్టర్ రామ్ ప్రసాద్ అనస్థీషియా సేవలు అందించారు. ఆర్‌ఎంఓ డాక్టర్ సోమరాజు దొర సమన్వయం, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎం. ముక్కంటేశ్వరరావు పర్యవేక్షణలో ఈ శస్త్రచికిత్స సజావుగా పూర్తయింది.

​ఆర్థోపెడిక్ శస్త్రచికిత్సలతో పాటు గైనకాలజీ విభాగంలోనూ పాల్వంచ సీహెచ్‌సీ వైద్య బృందం తన నైపుణ్యాన్ని చాటుకుంది. ఇటీవల ఒక క్లిష్టమైన హైరిస్క్ గర్భిణీ కేసును వైద్య బృందం సమర్థవంతంగా నిర్వహించి తల్లీబిడ్డ ఇద్దరినీ క్షేమంగా కాపాడింది. అత్యవసర పరిస్థితుల్లోనూ సమయస్ఫూర్తితో చికిత్స అందించి సురక్షిత ప్రసవం చేయడం ఆసుపత్రిలో అందుతున్న నాణ్యమైన వైద్య సేవలకు నిదర్శనంగా నిలిచింది. ​ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎం. ముక్కంటేశ్వరరావు మాట్లాడుతూ.. ఆసుపత్రిలో పనిచేస్తున్న అంకితభావం కలిగిన వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఇతర ఉద్యోగుల సమష్టి కృషి వల్లే ఇలాంటి క్లిష్టమైన శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించగలుగుతున్నామని తెలిపారు. వైద్య బృందం నిబద్ధత, సేవాభావమే ఆసుపత్రి సాధిస్తున్న విజయాలకు ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు.

​డీసీహెచ్‌ఎస్ డాక్టర్ రవి బాబు మాట్లాడుతూ.. సీహెచ్‌సీ స్థాయిలోనే ఇంతటి అత్యున్నత నైపుణ్యం అవసరమైన శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించడం ప్రభుత్వ వైద్యులు, సిబ్బంది అంకితభావానికి నిదర్శనమన్నారు. ప్రభుత్వ వైద్య బృందాలు సమర్థవంతంగా పనిచేస్తే పేద ప్రజలకు కూడా అత్యాధునిక వైద్య సేవలు అందించవచ్చని పాల్వంచ సీహెచ్‌సీ నిరూపిస్తోందని ప్రశంసించారు. ఇదే మోకాలి మార్పిడి శస్త్రచికిత్సను ప్రైవేటు ఆసుపత్రిలో చేయించుకుంటే సుమారు రూ.1.50 లక్షల వరకు ఖర్చయ్యేదని, ప్రభుత్వ ఆసుపత్రిలోనే చికిత్స అందడం ద్వారా రోగికి భారీ ఆర్థిక భారం తప్పిందని తెలిపారు.

​గతంలో ఇదే ఆసుపత్రిలో నిర్వహించిన మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతం కావడం, వైద్యులపై నమ్మకం కలగడంతో తమ కుటుంబ సభ్యురాలికి కూడా ఇక్కడే శస్త్రచికిత్స చేయించుకోవాలని నిర్ణయించుకున్నామని రోగి కుటుంబ సభ్యులు తెలిపారు. తమకు నాణ్యమైన వైద్య సేవలు అందించిన పాల్వంచ ఆసుపత్రి వైద్యులు, సిబ్బందికి వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని నిరూపిస్తూ, ప్రజల్లో ప్రభుత్వ వైద్య వ్యవస్థపై నమ్మకాన్ని మరింత పెంచేలా పాల్వంచ సీహెచ్‌సీ వైద్య బృందం చేస్తున్న కృషి అభినందనీయమని ప్రజలు కొనియాడారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>