వ‌ర‌ల్డ్ చెస్ ఛాంపియన్‌షిప్‌పై గుకేశ్ గురి!

క‌లం, స్పోర్ట్స్: ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలిచిన గుకేశ్ (Gukesh).. మరోసారి టైటిల్‌పై కన్నేశాడు. డిఫెండింగ్ ఛాంపియన్‌గా కాకుండా.. మళ్లీ విజేతగా నిలవడమే లక్ష్యమని స్పష్టం చేశాడు. మంగళవారం ప్రారంభం కానున్న ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌కు ముందు జెనీవాలో జరిగిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈసారి ఉజ్బెకిస్థాన్ గ్రాండ్‌మాస్టర్ జవోఖిర్ సిందరోవ్‌తో గుకేశ్ తలపడనున్నాడు. అతడు మంచి ఫామ్‌లో ఉన్నాడని గుకేశ్ ప్రశంసించాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆడగల సామర్థ్యం సిందరోవ్‌కు ఉందని పేర్కొన్నాడు. అతడితో పోటీ తన ఆటకు మంచి పరీక్షగా నిలుస్తుందని అభిప్రాయపడ్డాడు. మరోవైపు సిందరోవ్ కూడా ఈ పోటీని సమాన అవకాశాలున్న పోరుగా అభివర్ణించాడు. గుకేశ్ ఆటతీరును నిశితంగా పరిశీలించినట్లు తెలిపాడు.

ముఖ్యంగా అతడి లెక్కలు వేసే విధానం, చివరి వరకు పోరాడే తత్వం తనను ఆకట్టుకున్నాయని చెప్పాడు. 2025 నుంచి చెస్‌పై మరింత శ్రద్ధ పెట్టి కష్టపడినట్లు సిందరోవ్ వెల్లడించాడు. ఆ కష్టమే తన విజయాలకు కారణమని పేర్కొన్నాడు. ఇక ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోరులో పూర్తి దృష్టిని ప్రత్యర్థిపైనే పెట్టే అవకాశం ఉంటుందని గుకేశ్ తెలిపాడు. ఈ పోరుకు ముందు సర్ఫింగ్, ఇతర ఆటలు, పుస్తకాలు చదవడంతో సమయం గడిపినట్లు చెప్పాడు. రాబోయే రెండు వారాల పాటు జరిగే ఈ పోరులో ఇద్దరు గ్రాండ్‌మాస్టర్లు తమ అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>