14 గంటలు లిఫ్ట్‌లోనే.. పుణేలో షాకింగ్ ఘటన!

కలం, వెబ్ డెస్క్: పుణేలోని ఎంఐటీ–ఏడీటీ యూనివర్సిటీలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఒకటి, రెండు కాదు.. ఏకంగా 14 గంటల పాటు ఒక విద్యార్థిని లిఫ్ట్‌లోనే  ఇరుక్కుపోవడం (Student Lift Trap) సంచలనంగా మారింది. రాత్రంతా అందులోనే బిక్కుబిక్కుమంటూ గడిపింది. చివరికి ఆపరేటర్లు గమనించి, రక్షించడంతో ప్రాణాలతో బయటపడింది. గత వారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎంఐటీ–ఏడీటీ యూనివర్సిటీలో చదువుతున్న ఒక విద్యార్థిని గత బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఆరో ఫ్లోర్ నుంచి కిందకు వచ్చేందుకు లిఫ్ట్ బటన్ నొక్కింది.

ఈ క్రమంలో లిఫ్ట్ 5, 6వ ఫ్లోర్ల మధ్య ఆగిపోయింది. ఆమె వద్ద ఫోన్ ఉన్నా.. సిగ్నల్స్ లేకపోయేసరికి ఎవరికీ ఫోన్ చేయలేకపోయింది. అలారం బటన్, ఎమర్జెన్సీ సిస్టమ్ కూడా పూర్తిగా ఆగిపోవడంతో నిస్సహాయురాలిగా మారిపోయింది. క్యాంపస్ సిబ్బంది కూడా లిఫ్ట్ ఆగిపోయిన విషయాన్ని గమనించలేదు. దీంతో ఎవరైనా వస్తారేమో.. తనను రక్షిస్తారమేమోనని ఆశతో ఎదురుచూసినా నిరాశే ఎదురైంది.

క్యాంపస్ అంతటా వెతికినా..

తమ కుమార్తె ఇంకా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు క్యాంపస్‌లోకి వచ్చి ఆరా తీశారు. అంతటా వెతికినా ఆమె జాడ కనిపించకపోవడంతో ఆందోళనతో పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు సైతం విచారణ చేపట్టారు. మరోవైపు క్యాంపస్ సమయం ముగిసిపోవడంతో తాళాలు వేసి సిబ్బందితో సహా అంతా వెళ్లిపోయారు. సదరు విద్యార్థిని మాత్రం అందులోనే ఉండిపోయారు.

గురువారం ఉదయం లిఫ్ట్ బాగు చేసేందుకు వచ్చిన ఆపరేటర్లు అందులో ఒకరు ఉన్నారని గుర్తించి షాకయ్యారు. వెంటనే ఆమెను బయటకు తీసి.. క్యాంపస్ సిబ్బందికి సమాచారం అందించారు. ఆమె పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు గుర్తించి, తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి తీసుకెళ్లిపోయారు. ఈ ఘటనపై యూనివర్సిటీ అధికారులు ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>