కలం, ఖమ్మం బ్యూరో: ప్రభుత్వానికి దాదాపు కోటి రూపాయల ప్రజాధనం ఆదా అవుతున్న నాక్ బిల్డింగ్ టెండర్‌ను (NAC Building Tender)ఎలా రద్దు చేస్తారని జై భీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ మండిపడ్డారు. ఇటీవల నిర్వహించిన ఈ టెండర్ ప్రక్రియను రద్దు చేయాలంటూ స్థానిక ఎమ్మెల్యే లేఖ రాయడం సరైంది కాదని, టెండర్ రద్దు చేయాలనే ఆలోచనను అధికారులు వెంటనే విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సోమవారం కొత్తగూడెంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యే, అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
కొత్తగూడెంలో నాక్ బిల్డింగ్ నిర్మాణం కోసం ఆర్ అండ్ బి (R&B) అధికారులు మొట్టమొదటిసారి టెండర్లు ఆహ్వానించగా ఏడుగురు మాత్రమే పాల్గొన్నారని, ఆ తర్వాత చుంచుపల్లి మండలంలో ఏర్పాటు చేస్తామని మళ్లీ టెండర్ పిలిచినప్పుడు ముగ్గురు మాత్రమే పాల్గొన్నారని యెర్రా కామేష్ వివరించారు. రూ.7 కోట్ల 48 లక్షల విలువైన ఈ టెండర్‌ను ‘ఎన్.హెచ్.ఆర్. ఇన్ఫ్రా’ సంస్థ 13.29 శాతం తక్కువకు కోట్ చేసిందని, దీనివల్ల ప్రభుత్వానికి సుమారు కోటి రూపాయల మేర ప్రజాధనం ఆదా అవుతుందని స్పష్టం చేశారు. గత నెల 27న టెక్నికల్ బిడ్‌ను, ఈ నెల 4న ప్రైజ్ బిడ్‌ను ఓపెన్ చేశారని తెలిపారు.
బీటీ ప్లాంట్ ఉన్నవారికే టెండర్ దక్కాలనే కొత్త నిబంధనలు పెట్టి, తమకు అనుకూలమైన వ్యక్తులకు టెండర్ ఇప్పించాలని స్థానిక ఎమ్మెల్యే తహతహలాడారని ఆయన ఆరోపించారు. ఈ నెల 4వ తేదీన టెండర్ ఓపెన్ చేయడమే తడవుగా, టెండర్ రద్దు కోరుతూ ఎమ్మెల్యే తన లెటర్ హెడ్ ద్వారా సంబంధిత అధికారులకు 5వ తేదీన లేఖ రాయడం మంచి సాంప్రదాయం కాదని విమర్శించారు. టెక్నికల్ బిడ్, ప్రైజ్ బిడ్ ఓపెన్ చేసిన తర్వాత ఏ ప్రాతిపదికన టెండర్ రద్దు చేయడానికి వెళ్తారని ప్రశ్నించారు. అధికారులు సైతం తప్పుడు విధానాలు అవలంబిస్తే చూస్తూ ఊరుకోబోమని, చట్ట ప్రకారం టెండర్ ప్రక్రియ జరగకపోతే అధికారులనైనా సరే న్యాయస్థానాలకు లాగుతామని యెర్రా కామేష్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మాలోత్ వీరు నాయక్, అసెంబ్లీ అధ్యక్షుడు నాగుల రవికుమార్, ధనుంజయ్, రాజ్ కుమార్, వంశీ తదితరులు పాల్గొన్నారు.

