కలం, తెలంగాణ బ్యూరో: ఎల్ నినోతో రాష్ట్రంలో ఏర్పడిన కరువు పరిస్థితులు రైతాంగానికి ఆర్థికంగా ఇబ్బందికరంగా మారాయి. ఓవైపు వాతావరణ ప్రతికూల పరిస్థితుల్లో ఆశించినంత దిగుబడి రాలేదు. మరోవైపు పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి పరిహారం అందుతుందో లేదో తెలియని అయోమయం. ఈ గందరగోళం నడుమ ఆదుకుంటాయనుకున్న బ్యాంకులు సైతం రైతుల విషయంలో నిర్లక్ష్యంగానే వ్యవహరించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో అవి నిర్దేశించుకున్న లక్ష్యం మేరకైనా రుణాలను (Crop Loans) మంజూరు చేయలేకపోయాయి.
ఖరీఫ్ సీజన్లో రైతులకు రూ.58,152 కోట్ల మేర రుణాలను ఇవ్వాలని బ్యాంకులు లక్ష్యాన్ని పెట్టుకున్నా.. సీజన్ పూర్తయ్యే నాటికి (సెప్టెంబరు చివరకు) రూ.42,285 కోట్లను (73.75%) మాత్రమే ఇచ్చాయి. ప్రభుత్వ బ్యాంకులతో పోలిస్తే ప్రైవేటు బ్యాంకులే ఎక్కువ రుణాలు ఇచ్చాయి. రైతులను ఇబ్బంది పెట్టకుండా టార్గెట్ మేరకు రుణాలను మంజూరు చేయాలని ఆర్థిక మంత్రిగా ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బ్యాంకులకు సూచించారు. ఈ నెల 10న జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఈ మేరకు సూచనలు చేశారు.
ఖరీఫ్‌లో అలా.. రబీలో ఎలా?
ఖరీఫ్ సీజన్లోనే రైతులకు రుణాలు (Crop Loans) ఇవ్వడానికి బ్యాంకులు ఇబ్బంది పెడితే.. వర్షాభావ పరిస్థితుల్లో రబీ సీజన్‌కు లోన్లు ఇవ్వడానికి ఆసక్తి చూపుతాయా? లేదా? అనే సందేహం నెలకొన్నది. గత ఆర్థిక సంవత్సరం ఆరు నెలల వ్యవధిలో ఇచ్చిన వ్యవసాయ రుణాలతో పోలిస్తే ఈ సంవత్సరం అదే కాలానికి మంజూరు చేసినవి తక్కువగానే ఉన్నాయి. ‘వరి సాగు వద్దు.. ఆరుతడి పంటలే వేయాలి..’ అంటూ రైతాంగానికి ప్రభుత్వం సూచనలు ఇచ్చిన నేపథ్యంలో దిగుబడి గణనీయంగా తగ్గే అవకాశమున్నది. ఇలాంటి పరిస్థితుల్లో రుణం ఇస్తే రైతులు తిరిగి తీర్చగలుగుతారో లేదోననే అనుమానంతో బ్యాంకులు రబీ సీజన్ రుణాల మంజూరులో ఎలాంటి కిరికిరి చేస్తాయోననే ఆందోళన వ్యక్తమవుతున్నది. ఖరీఫ్ లక్ష్యాన్నే పూర్తిచేయలేని బ్యాంకులు.. రబీ రుణాల విషయంలో అనుకున్న టార్గెట్ చేరుకుంటాయా అనే అనుమానం వ్యక్తమవుతున్నది.
గ్రామీణ, సహకార బ్యాంకుల సహకారమేది?
వ్యవసాయ రంగ అవసరాలకు రైతులు ఎక్కువగా గ్రామీణ, సహకార బ్యాంకుల మీదనే ఆధారపడతారు. కానీ వాటి నుంచి ఆశించినంత సహకారం అందలేదని ప్రభుత్వానికి బ్యాంకులు సమర్పించిన గణాంకాలతో స్పష్టమవుతున్నది. ఖరీఫ్ సీజన్ లెక్కలను పరిశీలిస్తే ప్రైవేటు బ్యాంకులు 71% లక్ష్యాన్ని పూర్తి చేస్తే, ప్రభుత్వ బ్యాంకులు మాత్రం 54% మేరకే రైతులను ఆదరించాయి. ఇక ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు 52%, సహకార బ్యాంకులు 29% మేరకే రుణాలను మంజూరు చేశాయి. ప్రతీ ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావడానికి ముందే స్టేట్ లెవల్ బ్యాంకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేసి వాటి నుంచి రైతులకు రుణాల మంజూరుపై ప్రభుత్వం స్పష్టమైన యాక్షన్ ప్లాన్‌ను వివరిస్తుంది. కానీ ఈసారి అది ఆచరణలో లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది.
రైతులను ఆదుకోవాలి: భట్టి
ఖరీఫ్ సీజన్లో రైతులకు బ్యాంకులు అందించిన లోన్లను పరిగణనలోకి తీసుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ప్రభుత్వం స్పష్టమైన రోడ్ మ్యాప్ నిర్దేశించుకున్నదని, అది సాకారమయ్యేందుకు బ్యాంకులు కూడా సహకారం అందించాలని స్టేట్ లెవల్ బ్యాంకర్ల సమావేశంలో కోరారు. వ్యవసాయ రంగానికి రుణాల మంజూరులో ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో గుర్తించి వాటిని అధిగమించాలని సూచించారు. అనుకున్న టార్గెట్‌ను రీచ్ కావడానికి ‘ప్రోయాక్టివ్’గా సహకారం ఇవ్వాలని కోరారు. బ్యాంకులు, ద్రవ్య సంస్థలు, ప్రభుత్వ విభాగాలు సమష్టిగా కృషి చేసినప్పుడే తెలంగాణ రైజింగ్ విజన్ లక్ష్యం నెరవేరుతుందన్నారు. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. బ్యాంకులన్నీ నిర్దేశించుకున్న టార్గెట్‌ను పూర్తి చేయడమే కాక దానికంటే ఎక్కువగా రుణాలు ఇవ్వాలని కోరారు. ప్రస్తుత ఎల్‌నినో పరిస్థితులను గమనంలోకి తీసుకుని రైతులకు రుణాల మంజూరులో ‘టాప్ ప్రయారిటీ’ ఇవ్వాలని, అవసరమైతే అదనపు నిధులను సమకూర్చాలని సూచించారు.
ఇదీ క్రాప్ లోన్స్ లెక్క..
ఖరీఫ్ రుణాల టార్గెట్: రూ.58,152 కోట్లు
బ్యాంకులన్నీ ఇచ్చింది: రూ.42,285 కోట్లు (73.75%)
వ్యవసాయ టర్మ్ లోన్స్ టార్గెట్: రూ.57,192 కోట్లు
బ్యాంకులన్నీ ఇచ్చింది: రూ.28,578 కోట్లు (49.97%)
వ్యవసాయ ఇన్ఫ్రా రుణాల టార్గెట్: రూ.7,797 కోట్లు
ఆరు నెలల్లో మంజూరైంది: రూ.1,369 కోట్లు (17.69%)
వ్యవసాయ అనుబంధ రుణాల టార్గెట్: రూ.19,126 కోట్లు
వీటిలో మంజూరైంది: రూ.24,110 కోట్లు (126%)
మొత్తం వ్యవసాయ రంగ రుణాల టార్గెట్: రూ.1,81,035 కోట్లు
అన్ని బ్యాంకులు కలిపి ఇచ్చింది: రూ.96,943 కోట్లు (53.55%)
ఇందులో ప్రభుత్వ బ్యాంకుల వాటా: రూ.62,567 కోట్లు (టార్గెట్‌లో 54.24%)
ప్రైవేటు బ్యాంకుల వాటా: రూ.15,140 కోట్లు (టార్గెట్‌లో 71.03%)
ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల వాటా: రూ.12,724 కోట్లు (టార్గెట్‌లో 51.62%)
సహకార బ్యాంకుల వాటా: రూ.5,318 కోట్లు (టార్గెట్‌లో 29.41%)

