కలం, నల్లగొండ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సొంత ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Raj Gopal Reddy) ఇటీవల చేసిన బహిరంగ వ్యాఖ్యలు అధిష్టానం పెద్దల వరకు చేరాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల కొత్త ఇంచార్జ్ బీఎం సందీప్ ఆదివారం గాంధీభవన్‌లో పార్టీ వ్యవహారాలపై చర్చిస్తుండడం.. అదే సమయంలో రాజగోపాల్ రెడ్డి పెట్టిన సోషల్ మీడియా పోస్టు రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. “ నా ప్రయాణం ఆగదు.. నా పోరాటం ఆగదు.. ప్రజల కోసం నా అడుగు వెనక్కి పడదు” అంటూ ఆయన చేసిన పోస్టు పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఇదిలా ఉండగా.. ఏఐసీసీ కార్యదర్శి సూచనలతో సోమవారం గాంధీభవన్‌లో కొత్త ఇంచార్జ్ తో రాజగోపాల్ రెడ్డి భేటీ కానున్నారు. ముందుగా రాజగోపాల్ రెడ్డితో మాట్లాడి ఆయన అసంతృప్తికి కారణాలను తెలుసుకోవాలని సందీప్ భావిస్తున్నట్టుందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. రాష్ట్ర ముఖ్యనేతలతో చర్చించి, రాజగోపాల్ రెడ్డి వివరణ తీసుకున్న తర్వాతే హైకమాండ్‌కు తుది నివేదిక ఇవ్వాలని ఆయన నిర్ణయించినట్లు తెలుస్తుందంటున్నారు.
మరోవైపు అధికారంలో ఉన్న పార్టీలో బహిరంగ విమర్శలు ప్రభుత్వాన్ని ఇరుకున పెడతాయని టీపీసీసీ భావిస్తుండగా, రాజగోపాల్ రెడ్డి మాత్రం తన ఇమేజ్ను కాపాడుకునే వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్లు కనిపిందంటున్నారు. ఒకవైపు అధిష్టానం క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలని ఆదేశిస్తుంటే.. మరోవైపు రాజగోపాల్ రెడ్డి తన పంథా మార్చుకోనని చెప్పకనే చెబుతున్నారు. సోమవారం జరగబోయే భేటీలో రాజగోపాల్ రెడ్డి తన వాదనను ఎలా వినిపిస్తారు..? కొత్త ఇంచార్జ్ బీఎం సందీప్ ఈ వివాదాన్ని ఎలా చక్కదిద్దుతారు..? అనేది ఆసక్తికరంగా మారింది.

