నేడు తెలంగాణకు నితిన్ నబీన్.. బీజేపీ బలోపేతంపై దృష్టి!

కలం, తెలంగాణ బ్యూరో: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ (Nitin Nabin) నేడు (సోమవారం) తెలంగాణకు రానున్నారు. కరీంనగర్​​​​లో నిర్వహించనున్న మహాపాదయాత్రలో పాల్గొననున్నారు. ఆ మరుసటి రోజే (ఈ నెల 24న) కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్​​​​​​లో జరిగే ఓ ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరుకానున్నారు. అనంతరం పార్టీ సీనియర్ నేతలతో సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నెల 2న ‘సర్’కు మద్దతుగా మహాపాదయాత్రలో పాల్గొన్న ఆయన.. 20 రోజుల వ్యవధిలోనే మరోసారి హైదరాబాద్ కు వస్తుండటం ప్రాధాన్యత సంతరించుకున్నది.

ఇక ఈ నెల 25న కేంద్ర మంత్రి జేపీ నడ్డా సిద్దిపేటలో నిర్వహించనున్న మహా పాదయాత్రలో పాల్గొననున్నారు. మూడు రోజుల వ్యవధిలోనే ముగ్గురు జాతీయ స్థాయి నేతలు రాష్ట్రానికి రానుండటం రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నది. రాష్ట్రంలో పార్టీ కార్యక్రమాలు, సంస్థాగత బలోపేతంపై జాతీయ నాయకత్వం దృష్టి సారించిన నేపథ్యంలో ఈ పర్యటనలు సాగనున్నాయి. మహా పాదయాత్రల ద్వారా ప్రజల్లోకి వెళ్లడంతో పాటు పార్టీ శ్రేణులతో నేరుగా సమావేశమయ్యే అవకాశం ఉంది. ఆయా కార్యక్రమాల్లో స్థానిక నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా రాష్ట్ర నాయకత్వం ఏర్పాట్లు చేస్తున్నది. డిసెంబర్​​​​​లో అమిత్ షా మరోసారి తెలంగాణకు వచ్చే అవకాశం ఉందన్న చర్చ కూడా పార్టీ వర్గాల్లో సాగుతున్నది.

సునీల్ బన్సాల్ అసంతృప్తి!

ఇప్పటికే అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పోటాపోటీ కార్యక్రమాలతో రాజకీయ వేడిని పెంచుతుండగా, రాష్ట్రంలో పార్టీని మరింత దూకుడుగా ముందుకు తీసుకెళ్లేందుకు బీజేపీ వ్యూహరచన చేస్తున్నది. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి సునీల్ బన్సాల్ ఇప్పటికే పార్టీ నేతల పనితీరును సమీక్షించారు. కీలక నేతల ప్రోగ్రెస్ పై ఆయన అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు, ముఖ్యంగా ప్రధాన కార్యదర్శుల పనితీరుపై అసహనం వెలిబుచ్చినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లారా? ప్రత్యర్థులకు గట్టి సవాల్ విసిరేలా కార్యక్రమాలు చేపట్టారా? ప్రజా సమస్యలపై పోరాడుతూ అరెస్టుల వరకు వెళ్లిన సందర్భాలున్నాయా? అంటూ నేతలను నిలదీసి, పనితీరుకు ఆధారాలు చూపాలని ప్రశ్నించినట్లు సమాచారం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>