కలం, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గా నియమితులైన తర్వాత ఫస్ట్ టైమ్ హైదరాబాద్ కు వచ్చిన బీఎం సందీప్ కుమార్ (BM Sandeep Kumar).. ప్రస్తుత స్థితిగతులు, క్షేత్రస్థాయిలో బలం, బలహీనతలను తెలుసుకోవడంపై దృష్టి పెట్టారు. ఆదివారం నిర్వహించిన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ), పీసీసీ సలహా కమిటీ సమావేశాల్లో ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్, సీనియర్ నేతలు వెల్లడించిన అభిప్రాయాలను తెలుసుకున్నారు. సోమవారం పలు కీలక సమావేశాలు నిర్వహించనున్నారు.
మంత్రులతో విడివిడిగా భేటీ కావడం కోసం తలా 10 నిమిషాల చొప్పున సమయాన్ని కేటాయించుకున్నారు. ఇటు పార్టీ, అటు ప్రభుత్వ వ్యవహారాల్లోని అంశాలు, భేదాభిప్రాయాలు, సమన్వయం, సరిదిద్దుకోవాల్సిన అంశాలను వారి నుంచి అడిగి తెలుసుకోనున్నారు. ఆ తర్వాత జిల్లాల పార్టీ అధ్యక్షులతో కూడా ఇదే తరహాలో విడివిడిగా సమావేశమయ్యేందుకు తలా ఐదు నిమిషాల చొప్పున షెడ్యూలు రూపొందించుకున్నారు. ఈ రెండు కీలక భేటీల తర్వాత పలు అనుబంధ సంఘాల బాధ్యులతోనూ సమావేశమై ఇప్పటివరకు చేపట్టిన యాక్టివిటీస్, వాటి నుంచి వచ్చిన ఫలితాలపై వివరాలను అడిగి తెలుసుకోనున్నారు.
మంత్రులు, డీసీసీల నుంచి ఫీడ్ బ్యాక్
పీఏసీ, అడ్వయిజరీ కమిటీ, పీసీసీ విస్తృత స్థాయి సమావేశాల్లో సీఎం, పీసీసీ చీఫ్ సహా పలువురి నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ తో ఇప్పటికే ఒక అంచనాకు వచ్చిన ఇంచార్జ్ సందీప్… మంత్రులతో వన్-టు-వన్ సమావేశాల్లో ప్రభుత్వానికి, పార్టీకి మధ్య ఉన్న సమన్వయం, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలోని వైఫల్యం, మంత్రుల మధ్య సత్సంబంధాలు, ముఖ్యమంత్రితో ఉన్న గ్యాప్స్, పరిపాలనా వ్యవహారాల్లోని అంశాలు పార్టీపై చూపుతున్న ప్రభావం.. వీటి గురించి ఆరా తీయనున్నట్లు గాంధీభవన్ వర్గాల ద్వారా తెలిసింది. డీసీసీ అధ్యక్షులు సైతం పలువురిపై ఇటీవల పీసీసీకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అటు మంత్రులతో, ఇటు ఎమ్మెల్యేలతో ఉన్న సంబంధాలపై వివరాలు తీసుకోనున్నారు. నల్లగొండ జిల్లా పార్టీ అధ్యక్షుడు పున్న కైలాశ్ నేతకు, మంత్రి కోమటిరెడ్డికి మధ్య ఉన్న గ్యాప్, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డితో ఇటీవల తలెత్తిన అంతరం.. ఇలాంటి అంశాలపై తాజా పరిస్థితిని తెలుసుకోనున్నారు.
అనుబంధ సంఘాలపై ఆరా
పార్టీకి అనుబంధంగా ఉన్న పలు సంఘాల బాధ్యులతోనూ ఇంచార్జ్ సందీప్ విడిగా భేటీ కానున్నారు. ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్, సేవాదళ్, మహిళా కాంగ్రెస్ విభాగాలతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సెల్ లాంటి వింగ్స్ బాధ్యులతోనూ సమావేశం కానున్నారు. పార్టీ ఇచ్చిన పిలుపు, వాటిని ఆయా సెక్షన్ల ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఇప్పటివరకు నిర్వహించిన యాక్టివిటీస్, వాటి ద్వారా వచ్చిన ఫలితాలు, ఈ విభాగాలు ఏ మేరకు బలోపేతమయ్యాయి? కొత్త రిక్రూట్మెంట్స్ ఏ మేరకు జరిగాయి? ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు దీటుగా చేసిన కార్యాచరణ.. ఇలాంటి అన్నింటి గురించి రిపోర్టు తరహాలో వివరాలను తెలుసుకోనున్నారు. రానున్న రోజుల్లో పార్టీని బలోపేతం చేయడానికి ఈ విభాగాలు చేపట్టాల్సిన కార్యాచరణను రూపొందించుకోడానికి, టాస్క్ ఇవ్వడానికి ఈ సమావేశాలు దోహదపడనున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఈ విభాగాలు ఆయా సెక్షన్ల ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వచ్చిన రిజల్ట్ గురించి కూడా వారి నుంచి తెలుసుకోనున్నారు.
పార్టీ బలోపేతం, ఫ్యూచర్ స్ట్రాటెజీ
పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేయడానికి, దానికి తగిన భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకోడానికి ఈ సమావేశాలు కీలకం కానున్నాయి. చేసింది చెప్పుకోలేకపోతున్నాం.. అంటూ సీఎం వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో భవిష్యత్తులో ఈ అగాథాన్ని పూడ్చడానికి అనుసరించాల్సిన పద్ధతి గురించి కూడా వారి అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. పార్టీ కోసం కష్టపడినవారికి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా అవకాశాలు రాలేదన్న అసంతృప్తి నెలకొన్న పరిస్థితుల్లో ఇన్చార్జి దృష్టికి తీసుకెళ్లే అవకాశమున్నది. గతంలో మీనాక్షి నటరాజన్ సమావేశాలు నిర్వహించినప్పుడు ఈ అంశాలే ప్రస్తావనకు వచ్చాయి. నామినేటెడ్ పోస్టులు, పార్టీలో పదవులు రాకపోవడంతో అది క్షేత్రస్థాయిలో చూపుతున్న ప్రభావం గురించీ ఆరా తీసే అవకాశమున్నది. మరోవైపు సొంత పార్టీకి చెందిన నేతలు చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలతో వస్తున్న ఇబ్బందులు, మంత్రులతో పాటు ఎమ్మెల్యేల నుంచి తగిన సహకారం లేకపోవడం గురించి కూడా వారి నుంచి అభిప్రాయాలు తీసుకోనున్నట్లు సమాచారం.
ఈ నెల 27న ఫినిషింగ్ టచ్
అయితే రెండు రోజుల పర్యటనలో వివిధ స్థాయిల్లోని పార్టీ లీడర్ల నుంచి వచ్చే అభిప్రాయాలకు అనుగుణంగా ఈ నెల 27న ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో జరిపే సమావేశంలో ఇంచార్జ్ సందీప్ కీలకమైన సూచనలు చేసే అవకాశమున్నది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వీరి సహకారం అవసరమైనందున ఇప్పటి నుంచే గ్యాప్ లేకుండా చూసుకోవాలనే స్పష్టత ఇవ్వనున్నారు. ఇంచార్జ్ గా తొలిసారి రాష్ట్రానికి వచ్చినందున ప్రస్తుతానికి పార్టీలోని అన్ని విభాగాలు, స్థాయిల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని తాజా పరిస్థితిని అంచనా వేయనున్నారు. ఏఐసీసీకి నివేదించిన తర్వాత రానున్న రోజుల్లో రూపొందించాల్సిన వ్యూహంపై దృష్టి పెట్టనున్నారు.

