కలం, కరీంనగర్ బ్యూరో : ఈ నెల 29న కరీంనగర్లోని అలుగునూర్లో నిర్వహించే దీక్షా దివస్ బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ (Putta Madhukar) పిలుపునిచ్చారు. ఆదివారం మంథని మున్సిపల్ పరిధిలోని గంగాపురిలో దీక్షా దివస్(Deeksha Diwas) బహిరంగ సభపై వినూత్నంగా వాల్ రైటింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా పుట్ట మధూకర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో నిర్వహించే ఈ బహిరంగ సభ ద్వారా నేటి యువతకు తెలంగాణ ఉద్యమ చరిత్రను తెలియజేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా సాధించుకున్నాం? రాష్ట్ర సాధన కోసం ఉద్యమం ఎలా సాగింది? గత పదేళ్లలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ఏమిటి? ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మూడేళ్ల పాలనలో ఏం చేస్తోంది? అనే అంశాలను యువతకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు.
దీక్షా దివస్ ప్రారంభమైన రోజున పుట్టిన పిల్లలకు తెలంగాణ ఉద్యమం ఏ విధంగా జరిగిందో, రాష్ట్రం ఎలా సాకారమైందో తెలియదని పేర్కొన్నారు. చరిత్రను తెలుసుకున్న వారే చరిత్ర సృష్టిస్తారనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని అన్నారు. అలుగునూర్లో నిర్వహించే దీక్షా దివస్ సభకు మంథని నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు, అభిమానులు, ఉద్యమకారులు పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పుట్ట మధూకర్ పిలుపునిచ్చారు.

