కలం, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ (Hathras Accident) జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సికంద్రారావు ప్రాంతంలోని అలీగఢ్ రహదారిపై వేగంగా వచ్చిన ఓ బస్సు అదుపుతప్పి ప్రయాణికులతో వెళ్తున్న ఎలక్ట్రిక్ ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి ఆటో పక్కనే ఉన్న మరో రహదారిపైకి దూసుకెళ్లగా, అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులను అలీగఢ్ జిల్లా ఖైర్-టప్పల్ పరిధిలోని పాలా గ్రామానికి చెందిన రైస్ (35), ముస్తకీమ్ (40)లుగా అధికారులు గుర్తించారు.
ఒకే కుటుంబానికి చెందిన వారు సికంద్రారావులోని నౌరంగాబాద్లో జరుగుతున్న ఒక వివాహ వేడుకకు హాజరయ్యేందుకు ఆటోలో వెళ్తున్న వేళ ఈ విషాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ వాహనాన్ని వదిలి అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పరారీలో ఉన్న బస్సు డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

