మద్దిమడుగులో సీఎం స‌భ‌.. క్షేత్ర‌స్థాయిలో మ‌ల్లు ర‌వి ప‌రిశీల‌న‌

కలం, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న మద్దిమడుగు గ్రామంలో ఈనెల 26వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి (Mallu Ravi), జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదివారం అచ్చంపేట, మద్దిమడుగు ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా మద్దిమడుగులో సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహ ఏర్పాట్లకు శంకుస్థాపన చేయడంతో పాటు, సుమారు 5 వేల మంది గిరిజనులతో బహిరంగ సభ నిర్వహించనున్నారు. అదేవిధంగా అచ్చంపేట పట్టణంలో సుమారు లక్ష మందితో మరో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపడుతున్నారు.

ఈ నేపథ్యంలో ముందుగా అచ్చంపేట పట్టణంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించి, సభా ప్రాంగణం, ప్రజల రాకపోకలు, వాహనాల పార్కింగ్, భద్రత తదితర అంశాలపై చర్చించారు. అనంతరం మద్దిమడుగు గ్రామానికి చేరుకొని అక్కడ చేపడుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. మద్దిమడుగులో సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహ ఏర్పాట్లకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో సభా ప్రాంగణం, ముఖ్యమంత్రి హెలికాప్టర్ ల్యాండింగ్ కోసం ఏర్పాటు చేయనున్న రెండు హెలిప్యాడ్ల స్థలాలు, వీఐపీల పార్కింగ్ ప్రాంతాలు, ప్రజల రాకపోకలకు సంబంధించిన మార్గాలను పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. సభకు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో గిరిజనులు హాజరయ్యే అవకాశం ఉన్నందున తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, వైద్య సదుపాయాలు, రవాణా, పార్కింగ్ తదితర మౌలిక వసతులు సమకూర్చాలని సూచించారు.

ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అచ్చంపేట నియోజకవర్గ పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మద్దిమడుగు గ్రామంలో గిరిజనుల ఆరాధ్య దైవమైన సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహ ఏర్పాట్లకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన జరగనున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గిరిజనులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారని తెలిపారు. జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ మాట్లాడుతూ.. గిరిజనుల బహిరంగ సభతో పాటు అచ్చంపేట పట్టణంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు అవసరమైన ఏర్పాట్లను శాఖల వారీగా చేపట్టాలని సూచించారు. ప్రతి శాఖకు కేటాయించిన పనులను అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ ఎలాంటి లోటుపాట్లు లేకుండా ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.

అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా మద్దిమడుగులో నిర్వహించనున్న బహిరంగ సభకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి గిరిజనులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్న నేపథ్యంలో వారికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను కోరారు. అదేవిధంగా అచ్చంపేట పట్టణంలో నిర్వహించనున్న లక్ష మందితో కూడిన భారీ బహిరంగ సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున సభా ప్రాంగణం, పార్కింగ్, రవాణా, తాగునీరు, వైద్య సదుపాయాలు, భద్రత వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.

ఆలయంలో ప్రత్యేక పూజలు

ఏర్పాట్ల పరిశీలన అనంతరం ఎంపీ డాక్టర్ మల్లు రవి, జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మద్దిమడుగు ఆంజనేయస్వామి దేవాలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న వారికి అర్చకులు ప్రత్యేక పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో అచ్చంపేట సబ్ కలెక్టర్ సలోని చాబ్రా, అదనపు కలెక్టర్లు బి. చెన్నయ్య, దేవసహాయం, అచ్చంపేట డీఎస్పీ పి. శ్రీనివాసులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, పోలీస్ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>