కలం, నిర్మల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని(Indiramma Family Life Insurance Scheme) అర్హులైన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి కూచాడి శ్రీహరి రావు (Kuchadi Srihari Rao) అన్నారు. ఆదివారం నిర్మల్ జిల్లా కేంద్రంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి సంబంధించిన కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా శ్రీహరి రావు మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఈ పథకానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. 18 నుంచి 59 ఏళ్ల వయసున్న కుటుంబంలోని ఒకరికి ఈ బీమా పథకం వర్తిస్తుందని పేర్కొన్నారు. నిర్మల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు పథకంపై అవగాహన కల్పించాలని, అర్హులైన వారందరూ దరఖాస్తు చేసుకునేలా చొరవ చూపాలని సూచించారు.

