నీటి పంచాయతీ.. ఏపీ డిమాండ్‌కు తెలంగాణ చెక్ పెడుతుందా?

కలం, తెలంగాణ బ్యూరో: కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు త్రీ-మెన్ కమిటీ సమావేశం (KRMB Meeting) సోమవారం హైదరాబాద్‌లో జరగనున్నది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి గతంలో జరిగిన సమావేశాల్లో ఏకాభిప్రాయం కుదరలేదు. తాజాగా మరోమారు సమావేశం జరుగుతున్నది. 9 టీఎంసీల నీళ్లు ఇవ్వాల్సిందిగా ఇప్పటికే ఏపీ ప్రభుత్వం నుంచి బోర్డుకు రిక్వెస్టు అందింది.

దీనిపై సోమవారం నాటి సమావేశంలో చర్చ జరగనున్నది. గతంలో 10 టీఎంసీలను తీసుకున్న ఏపీ.. ఇప్పుడు మరో 9 టీఎంసీలను కోరుతుండడంతో తెలంగాణ తరఫున ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తమవుతాయన్నది కీలకంగా మారింది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న ఎల్‌ నినో పరిస్థితులతో హైదరాబాద్ నగరానికి తాగునీటిని సరఫరా చేయడం సంక్లిష్టంగా మారింది. నాగార్జునసాగర్ రిజర్వాయర్‌లో నీటి నిల్వ డెడ్ స్టోరేజీకి చేరుకున్న నేపథ్యంలో గోదావరి నుంచి తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఈ నెల నుంచి మూడు నెలల పాటు 9 టీఎంసీలను తీసుకెళ్లేలా ఏపీ ప్రతిపాదించడం గమనార్హం.

‘పల్నాడు’పై ప్రస్తావన

నాగార్జునసాగర్ రైట్ బ్యాంక్ వైపు నుంచి పల్నాడు జిల్లా 11 మండలాల్లోని 363 గ్రామాలకు నీటిని సరఫరా చేసేందుకు ఇన్‌టేక్ వెల్ నిర్మించే అంశాన్ని ఈ సమావేశంలో తెలంగాణ ప్రస్తావించే అవకాశమున్నది. సాగర్ బ్యాక్ వాటర్ నుంచే 510 అడుగుల లెవెల్ ఉన్నా డ్రా చేసుకునే వెసులుబాటు ఉండేలా నిర్మిస్తున్నందున ఇది తెలంగాణ నీటి అవసరాలకు గండి కొట్టడమే అవుతుందని ఇప్పటికే ఇరిగేషన్ అధికారులు కేఆర్ఎంబీకి లేఖ రాశారు. ఎలాంటి అనుమతి లేకుండా ఏకపక్షంగా నిర్మిస్తుండడం నిబంధనలను ఉల్లంఘించడమేనని, తక్షణం ఆ పనులను ఆపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

వాడీవేడి వాదనలు

ప్రస్తుతం రిజర్వాయర్లలో డెడ్ స్టోరేజీ ఉన్నందున కేవలం తాగునీటి అవసరాలకే వాడాలని, జనాభా నిష్పత్తికి అనుగుణంగా నీటిని విడుదల చేసే ఫార్ములాను రూపొందించాలని గత సమావేశాల్లో తెలంగాణ స్పష్టం చేసింది. కానీ ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఎలాంటి నిర్ణయం లేకుండా వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు జరగనున్న సమావేశంలో ఎలాంటి స్పష్టత వస్తుందన్నది కీలకంగా మారింది. రెండు రాష్ట్రాల ఇంజినీర్-ఇన్-చీఫ్‌లతో పాటు కేఆర్ఎంబీ మెంబర్ సెక్రటరీ ఈ సమావేశంలో పాల్గొంటున్నందున.. ఎలాంటి వాదనలు జరుగుతాయి? ఏపీ రిక్వెస్టు ప్రకారం 9 టీఎంసీల నీటి విడుదలలో ఎలాంటి నిర్ణయం జరుగుతుందన్నది ఆసక్తికరం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>