కలం, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జ్గా నియమితులైన బీఎం సందీప్ (BM Sandeep).. తొలిసారి రాష్ట్రానికి వస్తున్నారు. ఆయన నేడు (ఆదివారం) గాంధీభవన్‌కు రానున్నారు. రెండు రోజుల పాటు రాష్ట్రంలోనే మకాం వేసి.. పార్టీ పరిస్థితి, అంతర్గత అంశాలు, పార్టీ పనితీరు, నేతల మధ్య విభేదాలు, వివాదాలపై దృష్టి సారించనున్నారు. గాంధీభవన్‌లో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ (పీఏసీ), పీసీసీ సలహా కమిటీల ఉమ్మడి సమావేశాన్ని నిర్వహించనున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, కీలక నేతలు ఈ మీటింగ్‌కు హాజరు కానున్నారు.
అనంతరం పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ తాజా పరిస్థితి, ప్రభుత్వంతో సమన్వయంపై రివ్యూ చేస్తూనే నేతల అభిప్రాయాలను తెలుసుకుంటారు. ఈ పర్యటనలో డీసీసీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నేతలతోనూ విడివిడిగా సమావేశం కానున్నారు. ఇటీవల కాలంలో పలువురు పార్టీ నేతలు వివాదాస్పద కామెంట్లు చేయడం, ప్రభుత్వాన్ని తప్పుబట్టడం, ముఖ్యమంత్రిని విమర్శించడం తదితర అంశాలపైనా రివ్యూ చేయనున్నారు. అందులో భాగంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నుంచి ఈ నెల 23న వివరణ తీసుకోనున్నారు. ఆ తర్వాత ఏఐసీసీకి నివేదిక ఇవ్వనున్నారు.
మూడు నెలలుగా నో ఇన్చార్జ్
రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్గా ఇంతకాలం ఉన్న మీనాక్షి నటరాజన్.. విదేశీ చదువుల నిమిత్తం సెప్టెంబర్ సెకండ్ వీక్‌లో బాధ్యతల నుంచి రిలీవ్ అయ్యారు. అప్పటి నుంచి రాష్ట్రానికి ఏఐసీసీ తరఫున ఇన్చార్జ్ లేరు. ఇప్పుడు సందీప్‌ను నియమించడంతో రాష్ట్రంలోని పార్టీ వ్యవహారాలను అర్థం చేసుకుని, తాజా పరిస్థితిపై అంచనాకు రావడంతో పాటు తక్షణం తీసుకోవాల్సిన చర్యలపై ఆయన దృష్టి పెట్టనున్నారు.
పార్టీని సెట్‌రైట్ చేయడం, ప్రభుత్వానికి పార్టీ మధ్య మెరుగైన సమన్వయాన్ని నెలకొల్పడం, గీత దాటుతున్న నేతలను నియంత్రించడం, సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడం.. ఇలాంటి వాటిపై ఫోకస్ పెట్టనున్నారు. మంత్రులకు ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్, ఎమ్మెల్యేలతో డీసీసీ చీఫ్‌లకు ఉన్న అంతరం, దాన్ని చక్కదిద్దడం, ఖాళీగా ఉన్న పార్టీ పోస్టులను భర్తీ చేయడం, నామినేటెడ్ పోస్టుల భర్తీలో ప్రయారిటీస్‌ను ఫిక్స్ చేయడం.. ఇలాంటివన్నీ కీలకంగా మారనున్నాయి. నాయకత్వ స్థాయిలో జాయింట్, విడివిడి సమావేశాలు నిర్వహించిన తర్వాత ప్రజా ప్రతినిధులుగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతోనూ విడివిడి సమావేశాలను నిర్వహించాలని అనుకుంటున్నారు.
మంత్రుల నుంచి ఫీడ్ బ్యాక్
పీఏసీ, పీసీసీ అడ్వయిజరీ కమిటీలతో సమావేశమై పార్టీ వ్యవహారాలపై చర్చించనున్న సందీప్.. ఆ తర్వాత మంత్రులతోనూ విడివిడిగా భేటీ కానున్నారు. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయంతో పాటు ప్రభుత్వ పనితీరుపై మంత్రుల అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. మంత్రుల మధ్య సమన్వయం, పాలనాపరంగా ఎదురవుతున్న సమస్యలు, పథకాల ఫలితాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలోని లోపాలు, ఇకపైన చేపట్టాల్సిన కార్యక్రమాలు.. వీటిపై మంత్రుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోనున్నారు.
ప్రభుత్వంపై విపక్షాలు చేస్తున్న విమర్శలు, దానికి దారితీసిన కారణాలు, వాటికి కౌంటర్ ఇవ్వడంపై అనుసరించాల్సిన విధానాలపైనా చర్చించే అవకాశమున్నది. పార్టీ పవర్లోకి రావడానికి కష్టపడినవారికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వడం, దీర్ఘకాలంగా కొన్ని పెండింగ్‌లో ఉండడం, మరికొన్నింటిని రెన్యూవల్ చేయాల్సి వస్తే ఎవరికి అవకాశం ఇవ్వాలనేది కూడా మంత్రుల నుంచి తెలుసుకోనున్నారు.
డీసీసీ ప్రెసిడెంట్లు, అనుబంధ సంఘాలతో..
మంత్రులతో సమావేశాల తర్వాత పార్టీ జిల్లా అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులతో సందీప్ (BM Sandeep) ముఖాముఖి సమావేశాలు నిర్వహించనున్నారు. జిల్లాల్లో పార్టీ పరిస్థితులు, ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్యెల్యేల వ్యవహార శైలి, వారి మధ్య ఉన్న అంతరాలు, బహిరంగంగా చేస్తున్న విమర్శలు, క్షేత్ర స్థాయిలో పార్టీ శ్రేణుల అభిప్రాయాలను ఈ భేటీలో తెలుసుకుంటారని గాంధీభవన్ వర్గాలు పేర్కొన్నాయి. పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ సంఘాలు, డీసీసీ అధ్యక్షులు చేపట్టిన కార్యక్రమాలు, శ్రేణులను ఇన్వాల్వ్ చేయడం, ప్రజలను భాగస్వాములను చేయడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి చేస్తున్న కార్యక్రమాలు.. వీటన్నింటిపైనా ఈ సమావేశంలో చర్చించనున్నారు.
27న ప్రజాప్రతినిధులతో సమావేశం
రెండు రోజులపాటు వరుస సమావేశాలు నిర్వహించిన తర్వాత ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో ఈ నెల 27న మరో సమావేశాన్ని సందీప్ నిర్వహించనున్నారు. పార్టీలోని పరిస్థితులపై స్పష్టమైన అవగాహనకు రానున్నారు. మంత్రులు, జిల్లా అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులతో సమావేశాల్లో వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నుంచి మరికొన్ని వివరాలను రాబట్టనున్నారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి ఉన్న అనుకూల, ప్రతికూల పరిస్థితులపై గ్రౌండ్ రిపోర్టును వారి నుంచి తీసుకోనున్నారు. కొత్త ఇన్చార్జ్ పర్యటనపై కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తి నెలకొన్నది. ఈ మూడేండ్లలో ఈయన నాలుగో ఇన్చార్జ్ కావడం, ఇప్పటి వరకు తలెత్తిన సమస్యలు, తీసుకున్న కఠిన నిర్ణయాలు, అయినా ఆగని వివాదాస్పద కామెంట్లు.. ఇవన్నీ కొత్త ఇన్చార్జ్ సందీప్‌కు పరీక్షగా మారనున్నాయి. ఆయన మార్క్ ఏ విధంగా ఉంటుందనేది గాంధీభవన్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
రాజగోపాల్‌రెడ్డికి పిలుపు
ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ ఇటీవల వివాదాస్పద కామెంట్లు చేసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యవహారం ఏఐసీసీ దృష్టికి వెళ్లడంతో రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ని కలవాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ఈ నెల 23న ఆయన హైదరాబాద్‌కు వచ్చి బీఎం సందీప్‌తో సమావేశం కానున్నారు. రాజగోపాల్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వీడియో ఫుటేజీని ఇప్పటికే పరిశీలించిన సందీప్.. ఆయన నుంచి వివరణ తీసుకోనున్నారు. ఆ తర్వాత ఏఐసీసీకి నివేదిక ఇవ్వనున్నారు. రాజగోపాల్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ఆ తర్వాత ఖరారు కానున్నది. ఇప్పటివరకు వివాదాస్పద కామెంట్లు చేసినవారిపై అధిష్టానం తీసుకున్న చర్యలు, అయినా కట్టడి కాకపోవడానికి దారితీస్తున్న పరిస్థితులు, ఇకపైన రిపీట్ కాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన నిర్ణయాలు.. వీటిపై కూడా సందీప్ దృష్టి పెట్టనున్నారు.

